కొరాపుట్: బీజేపీకి చెందిన నబరంగ్‌ఫూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి జిల్లా కేంద్రంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని మున్సిపల్ పార్క్ సమీపంలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, గాయిత్రి ఆలయంలో అదనపు భవనం నిర్మాణం, మహిమా ధర్మ ఆశ్రమంలో మరామ్మతులు, భగవతివీధిలో మరమ్మతులు, చైతన్య మందిరం అభివృద్ధి, గౌడవీధిలో దుర్గామండపం ప్రహరీ, దసరా పొదలో శాంతి యువజన సంఘం సామాజిక భవనం, గాయత్రి మందిరంలో పారాయణ భవనం, బినోద్ ప్యాలెస్ వెనక శివ మందిరం నిర్మాణానికి భూమి పూజలు చేశారు. ప్రతి నిర్మాణం కోసం ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి రూ. 6 లక్షలు చొప్పున మంజూరు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కును నాయక్, కౌన్సిలర్ ఎ.సతీష్, బీజేపీ నాయకులు సురేష్ శాస్త్రి, సంజీవ్ నందా పాల్గొన్నారు.


