జయపురం: జయపురం సమితి ఉమ్మిరి గ్రామ పంచాయతీ మొకాపుట్ గ్రామ రోడ్డును, ప్రభుత్వ స్థలాలను కొంతమంది ఆక్రమించి ఇళ్లు, వ్యక్తిగత దుకాణాలు నిర్మించుకుంటున్నారని, దీనివలన తాము ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జయపురం సబ్ కలెక్టర్ జాదుమని నాయిక్‌కు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలు వలన స్థలం లేకపోవడంతో స్థానికులు పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారని ఆరోపించారు. కనీసం అంబులెన్స్, అగ్నిమాపక వాహనం వచ్చేందుకు కూడా వీలు లేకుండా పోయిందని వాపోయారు. ఆక్రమణలు అడ్డుకోవాలని వెళ్తే తమను భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన వెంటనే గ్రామంలో జరుగుతున్న ఆక్రమణలను తొలగించి గ్రామానికి రోడ్డు వేయాలని కోరారు. కార్యక్రమంలో పంకజ హరిజన్, మంగళధన్ హరిజన్, కుముటి ఖోశ్ల, జీరు బాగ్, సునీల్ ఖోశ్ల, సుభాష్ హరిజన్, సొన ఖోశ్ల, సుశాంత ఖోశ్ల తదితరులు పాల్గొన్నారు.


