శ్రీకాకుళం కల్చరల్: ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న జెడ్పీ సమావేశ మందిరంలో వార్షిక సమావేశం నిర్వహిస్తున్నట్లు రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి సభ్యులంతా హాజరుకావాలని కోరారు. విరాళాలు అందచేసిన దాతలకు, రక్తదాన శిబిరాలు నిర్వాహకుల కు, నేత్ర మోటివేటర్లకు, వలంటీర్లకు సేవా ప తకం, అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు.
చెట్టు నుంచి జారిపడి
వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్: పెద్దరోకళ్లపల్లి గ్రామానికి చెందిన రాంప్రాతుని చంద్రశేఖర్ అనే యువకుడు శుక్రవారం చెట్టు పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో కుడిచెయ్యి విరిగిపోయింది. వెంటనే బాధితుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
హక్కుల సాధనకు
ఐక్య ఉద్యమాలే శరణ్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగుల హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలే శరణ్యమని ఏపీ అమరావతి జేఏసీ జిల్లా అధ్యక్షుడు బీవీఎన్ రాజు అన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై ఉద్యమబాటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా సర్వే ఉద్యోగుల సంఘం, గణాంక శాఖ ఉద్యోగుల సంఘం, ట్రెజరీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు జేఏసీ అధ్యక్షుడిని కలిసి మద్దతు ప్రకటించారు. సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.జగన్, కార్యవర్గ సభ్యులు, గణాంక శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.సుధాకరరావు, కార్యవర్గ సభ్యులలు, ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ట్రెజరర్ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పి.వి.రమణ తదితరులు మద్దతు తెలియజేశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
సోంపేట: సోంపేట – బారువ రైల్వేస్టేషన్ల పరిధిలో సుమారు 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నలుపు ఫుల్‌హ్యాండ్ షర్ట్, నీలం జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. మృతదేహన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలకు రైల్వే కానిస్టేబుల్ ఎం.సోమేశ్వరరావు (9492250069)ను సంప్రదించాలని కోరారు.
పిడుగుపాటుకు ఆవు మృతి
కవిటి: జగతి గ్రామంలో పూడి వంశీమోహన్‌కు చెందిన ఆవు పిడుగుపాటుకు గురై మృతి చెందింది. శుక్రవారం మధ్యాహ్నం తోటలో ఆవు మేస్తుండగా పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పశుసంవర్థఖ శాఖాధికారులు ఆవును పరిశీలించి పిడుగు పాటు కారణంగా మృతి చెందినట్లు నిర్థారించారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కుటుంభ సభ్యులు కోరారు.
గుండెపోటుతో
హెడ్ కానిస్టేబుల్ మృతి
శ్రీకాకుళం క్రైమ్ : ఇచ్ఛాపురం టౌన్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని ప్రసాద్(56) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన ప్రసాద్ పీఎన్‌కాలనీ సంపత్‌బాలాజీనగర్‌లో భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. కుమార్తె ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు సంతోష్ లా చదువుతున్నారు. కొన్నేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్న ప్రసాద్ సాధారణ బదిలీల్లో భాగంగా గత జూన్‌లో ఇచ్ఛాపురం చేరారు. తనకు అనారోగ్యమని, డయాలసిస్‌కు ఇబ్బంది అవుతుందని, కుటుంబానికి దగ్గరగా ఉండేలా బదిలీ చేయమని ఎస్పీని పలుమార్లు వేడుకున్నట్లు పోలీసువర్గాల సమాచారం.
22న చేనేత కార్మికుల ధర్నా
రణస్థలం: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు లావేరులో చేనేత కార్మికులతో కలిసి ధర్నా కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు నేతన్న నేస్తం కింద సంవత్సరానికి రూ.25వేలు ఎప్పటిలోగా అమలు చేస్తారో నేతన్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డి.వెంకట్, యు.శంకరయ్య, ఎ.గడ్డియ్య, యు.పెంటలింగ, ఏ.ఉమా, కె.జాంబ, ఎన్.రుద్రయ్య, యు.కాశి, ఏ.వేణు తదితరులు పాల్గొన్నారు.


