బయో ప్రాసెసింగ్‌ యంత్రాలకు నిప్పు | - | Sakshi
Sakshi News home page

బయో ప్రాసెసింగ్‌ యంత్రాలకు నిప్పు

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరానికి సమీపంలో గల వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో గుర్తు తెలియని దుండగులు యంత్రాలకు నిప్పుపెట్టి తగులబెట్టారని బాధితుడు సదరు పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం నాడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. రాయగడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న లెగసీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టును జానేశ్వర్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్ధ నిర్వహిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన బయో ప్రాసెసింగ్‌ యంత్రంలో భాగమైన కన్వేయర్‌ బెల్టులు, కేబుళ్లు తదితర భాగాలను తెల్లవారు 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు తగులబెట్టినట్లు సంస్థ సైట్‌ ఇన్‌చార్జి ఎన్‌.శ్రీకాంత్‌ సదరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే యంత్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇదివరకు ఒకసారి ఇలానే తగులబెట్టారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతుండటంపై అసూయతో కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడి ఉండవచ్చని ఫిర్యాదులో వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అగ్నిప్రమాదం వెనక ఉన్న కారణాలు, దుండగుల వివరాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఐఐసి ప్రసన్న కుమార్‌ తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement