2040 నాటికి సికిల్‌ సెల్‌ వ్యాధి నిర్మూలన | - | Sakshi
Sakshi News home page

2040 నాటికి సికిల్‌ సెల్‌ వ్యాధి నిర్మూలన

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

రాయగడ: భారత ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ సికిల్‌ సెల ఎనీమియా నిర్మూలన మిషన్‌ కింద 2040 ఏడాది నాటికి దేశంలో ఈ వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా పూర్తిగా తొలగించే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి అన్నారు. స్థానిక జిల్లా ముఖ్యవైద్యాధికారి కార్యాలయం సమావేశం హాల్‌లో శుక్రవారం ప్రపంచ సికిల్‌ సెల్‌ అవగాహన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వివిధ స్థాయిల్లో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన జిల్లాలోని గిరిజన ప్రాంతాలు, గ్రామాలు విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు స్క్రీనింగ్‌ శిబిరాలు, సలహా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్సపై సమచార కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల్లో వ్యాధి గురించి పూర్తి అవగాహన కలిగించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్‌ నగేంద్ర నాథ్‌ మహాపాత్రో మాట్లాడుతూ.. వ్యాధి ముందస్తు గుర్తింపు, క్రమబద్ధమైన చికిత్స, ప్రజా చైతన్యం, సామాజిక భాగస్వామ్యమే సికిల్‌సెల్‌ వ్యాధి నియంత్రణకు ప్రధాన మార్గాలని అభిప్రాయపడ్డారు. అనంతరం వ్యాధికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలొ డాక్టర్లు రుమామహాపాత్రో, మమత గౌధరి, జిల్లా ప్రొగ్రామ్‌ మేనేజరు లక్ష్మీధర్‌ మహాపాత్రో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement