రాయగడ: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్ ) ప్రక్రియను వేగవంతంగా, తప్పులు లేకుండా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అశుతోష్ కులకర్ణి అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీ పరిశీలన, డిజిటలైజేషన్ పనులు పురోగతిని గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. 140 రాయగడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రాయగడ పట్టణ ప్రాంతాన్ని సందర్శించారు. ఫారాల సేకరణ, ధ్రువీకరణ, డేటా డిజిటలైజేషన్ ప్రక్రియలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్ధేశిత గడువులోగా పనులను నాణ్యతతో పూర్తిచేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకొకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో ఎన్నికల నమోదు అధికారి, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్నా, సహాయ ఎన్నికల నమోదు అధికారి, రాయగడ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్‌తో పాటు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. ఓటరు జాబితా నవీకరణకు సంబంధించిన ఈ కీలక కార్యక్రమాన్ని సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు.


