వాస్తవాలు వెలుగులోకి రావాలి | - | Sakshi
Sakshi News home page

వాస్తవాలు వెలుగులోకి రావాలి

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

వాస్తవాలు వెలుగులోకి రావాలి మహిళ అనుమానాస్పద మృతి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శేఖర్‌బాబు మృతికి సంతాపం అక్రమ రవాణాను అరికట్టాలి నేడు సిక్కోలు ప్రగతి సంబరాలు

ఇచ్ఛాపురం రూరల్‌: విజయవాడలో సాయికృష్ణ లాకప్‌ డెత్‌ ఘటన విషాదకరమైన ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. గురువారం ఆయన ఇచ్ఛాపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. తన కొడుకును చంపేస్తే కనీసం శవమైనా ఇవ్వండీ, లేకపోతే బూడిదైనా ఇవ్వండి అని ఒక తల్లి వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, దోషులు ఎవరైనా చట్టం ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో సామాన్యులకు భద్రత లేకుండా పోయిందని, రెడ్‌బుక్‌ రాజ్యాంగంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సోంపేట : గొల్లూరు గ్రామానికి చెందిన పిన్నింటి ఊర్వశి (38) గురువారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మంచంపై విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మార్చి 13న ఊర్వశి భర్త పిన్నింటి రాజారావు అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఇప్పుడు ఊర్వశి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామా అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఊర్వశి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

శ్రీకాకుళం : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, జిల్లాలో కలెక్టర్‌గా సేవలందించిన ఎస్‌ఈ శేఖర్‌బాబు మృతి పట్ల విశ్రాంత ప్రణాళిక శాఖ అధికారి డాక్టర్‌ వి.మహీపాల్‌, విశ్రాంత సీనియర్‌ రెవిన్యూ అధికారి పీఎంజే బాబు, జర్నలిస్టుల సంఘం నాయకులు నల్లి ధర్మారావు తదితరులు గురువారం సంతాపం వ్యక్తం చేశారు. 1990 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన శేఖర్‌బాబు 1998–99 మధ్య శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ గా పనిచేశారు. శ్యామ్‌ పిస్టన్‌ పరిశ్రమ లాకౌట్‌ సమయంలో విశేష అధికారాలు ఉపయోగించి తెరిపించడం ఆ రోజుల్లో సంచలనం. శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డున ప్రెస్‌క్లబ్‌ నిర్మాణానికి స్థలం కేటాయించడంలో ఆయనదే ప్రధాన పాత్ర. బదిలీ తరువాత పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా, సమాచార కమిషన్‌ కార్యదర్శిగా పనిచేసి 2012లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.

శ్రీకాకుళం: జిల్లాలో జోరుగా సాగుతున్న ఇసుక, గ్రావెల్‌, గ్రానైట్‌ అక్రమ రవాణాను అరికట్టి ప్రకృతి వనరులను పరిరక్షించాలని యునైటెడ్‌ జనతాదల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతినాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు, నలుగురు ఎమ్మెల్యేల డైరెక్షన్‌లో అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఇందులో కొందరు పోలీసులు, అధికారుల పాత్ర ఉందన్నారు. కలెక్టర్‌, ఎస్పీలు స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. సమావేశంలో జేడీయూ జిల్లా కార్యదర్శి అంధవరపు మనోహర్‌, జిల్లా మహిళా కన్వీనర్‌ మామిడి తేజోవతి, బురగాపు లక్ష్మి పాల్గొన్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : జిల్లా కేంద్రంలో శుక్రవా రం నిర్వహించనున్న జిల్లా స్థాయి ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం‘ (దీపం–2.0 థీమ్‌) ప్రగతి సంబరాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌పుండ్కర్‌ కోరారు. ఈ మేరకు గురు వారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతి, వివిధ రంగాలలో సాధించిన విజయాలను ప్రజల కు వివరించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసిందన్నారు. సుమారు 5,000 మంది లబ్ధిదారులతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు. ఏడు రోడ్ల కూడలి సమీపంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో ఉదయం 10:30 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement