వ్యవసాయ రంగంలో సౌర శక్తి బహుళ ప్రయోజనకారి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగంలో సౌర శక్తి బహుళ ప్రయోజనకారి

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

భువనేశ్వర్‌: వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగం బహుముఖ ప్రయోజనకారిగా అక్కరకు వస్తుంది. సాగు కార్యకలాపాల్లో నీటిపారుదల ఖర్చులు తగ్గించి అదనపు ఆదాయ వనరులను ప్రేరేపిస్తుంది. మరో వైపు రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు చేయూతగా నిలుస్తుందన్నారు. లోక్‌ భవన్‌ న్యూ అభిషేక్‌ హాల్‌లో జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించిన సందర్భంగా గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో నీటిపారుదల వ్యవహారాల్లో వ్యవస్థలను సౌరశక్తి వినియోగంపై రైతులను ప్రోత్సహించాలని అధికారులను కోరారు. ఈ చొరవ వల్ల ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడంతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. సంప్రదాయ విద్యుత్‌ పంపుల నుంచి సౌరశక్తి ప్రత్యామ్నాయాలకు మారే ప్రక్రియను సులభతరం చేయడానికి పీఎం కుసుమ్‌ పథకంపై అవగాహన ప్రచారాలను ముమ్మరం చేసి వ్యూహాలను రూపొందించాలని సంబంధిత విభాగానికి సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌లో జలవనరుల శాఖకు రూ.14,500 కోట్లు కేటాయించడం నీటి పారుదల మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి రైతులకు నీటి భద్రతను కల్పించడానికి దోహదపడుతుందన్నారు. వ్యవసాయ క్షేత్రాలకు నీరు సరిగ్గా చేరని నీటి పారుదల వ్యవస్థలను చేపల పెంపకం అవకాశాల అన్వేషణపై ఆసక్తి ప్రేరేపించాలన్నారు. ఈ చర్యతో రైతులకు అదనపు ఆదాయ వనరును అందించి గ్రామీణ జీవనోపాధి మెరుగుదలకు సద్వినియోగ పరచుకోవాలన్నారు.

ఈ సమావేశంలో నదీ ప్రవాహంలోని నీటి నిల్వ నిర్మాణాలు, ప్రధాన, లఘు నీటి పారుదల ప్రాజెక్టులు, సాగు నీటి సామర్థ్యంపై గవర్నర్‌ సమాచారం కోరారు. కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి వేగవంతమైన అమలుతో రైతులకు, గ్రామీణ సమాజాలకు గరిష్ట ప్రయోజనాలను చేకూర్చాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. సమావేశానికి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శుభా శర్మ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు మరియు లోక్‌ భవన్‌ అధికారులు హాజరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement