రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో పిల్లలను ఎత్తుకెళ్లే వారంటూ ఢిల్లీలోని ఆజాద్‌పూర్ ప్రాంతానికి చెందిన సుమన్ ఝా, గుజరాత్‌లోని సూరత్ ప్రాంతానికి చెందిన అర్చిత సుతారియాలపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. గురువారం నిందితులను కోర్టుకు తరలించారు. కళ్యాణసింగుపూర్ ప్రాంతంలో పిల్లలను ఎత్తుకెళ్లే వారని అనుమానించి యువతీ, యువకునిపై గ్రామస్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రగాయాలకు గురైన ఇద్దరూ హాస్పిటల్ పాలయ్యారు. ఈ మేరకు బాధితులు తమపై అమానుషంగా దాడి చేశారంటూ గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదును ఆధారంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి 16 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరి కొందరు ఉన్నారని భావిస్తున్న పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. కంధమాల్ జిల్లాలోని దారింగిబడిలో స్వచ్ఛంద సేవా సంస్థలో యువతి, యువకుడు పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఏదో పనిపై స్కూటీపై బయలుదేరి కలహండి జిల్లా తువామూల్ రాంపూర్‌కు వెళ్లారు. అటువైపుగా రహదారి లేదని చెప్పడంతో తిరిగి వస్తుండగా కొందరు వారిని అడ్డగించారు. దీంతో స్కూటీ వేగాన్ని పెంచి వెళ్లే క్రమంలో జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో గల విద్యుత్ కార్యాలయంలో ప్రాణభయంతో దాక్కున్నారు. అది గమనించి వీరిని వెంబడించినవారు పిల్లలను ఎత్తుకెళ్లేవారు ఇక్కడ తిరుగుతున్నారని ప్రచారం చేసి కేకలు పెట్టారు. దీంతో గ్రామస్తులు చేరుకుని ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు.


