సురక్షిత రైలు ప్రయాణానికి ..
భువనేశ్వర్: రాష్ట్రంలో రుతు పవనాల ప్రవేశంతో ఘాటీ ప్రాంతాల్లో సురక్షిత రైలు ప్రయాణం కోసం భద్రత, రక్షణ చర్యల్లో తూర్పు కోస్తా రైల్వే తలమునకలై ఉంది. వర్షా కాలంలో కొండవాలు ప్రాంతాలు, సొరంగాల గుండా రైళ్ల రవాణా కత్తి మీద సాములా సాగుతుంది. ఆయా మార్గాల్లో ఏ క్షణంలో కొండ చరియలు జారి పడతాయో చెప్పలేం. ఈ అవాంఛనీయ సంఘటనల నివారణకు తూర్పు కోస్తా రైల్వే ముందస్తు కార్యాచరణతో ప్రయాణికులకు విశ్వసనీయమైన రక్షణ, భద్రత కల్పించేందుకు కృషి చేస్తుంది. తూర్పు కోస్తా రైల్వే కొత్తవలస–కిరండల్ (కేకే), కొరాపుట్–రాయగడ (కేఆర్), రాయగడ–విజయనగరం (ఆర్‌వి) రైల్వే సెక్షన్లలోని సంక్లిష్టమైన మలుపులు, సొరంగాల గుండా సురక్షిత రైలు రవాణాకు ముందస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు. ఆయా మార్గాల్లో కొండ చరియలు విరిగిపడటం, నేల కోత, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు గురయ్యే సమస్యాత్మక ఘాట్ సెక్షన్లలో ఈ పనులు జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాల భద్రత, విశ్వసనీయ రక్షణ పెంపుదలకు రాక్ ఫాల్ బారియర్స్, రాక్ బోల్టింగ్, వైర్ మెష్ నెట్టింగ్, జియోమాట్ ఏర్పాటు, సొరంగాలను బలోపేతం, ఆధునిక వాలు స్థిరీకరణ చర్యలను ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేస్తున్నారు.
కేకే–1 సెక్షన్‌లో గణనీయమైన పురోగతి
కేకే–1 సెక్షన్‌లో ఈ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో మొత్తం 910 మీటర్ల రాక్ ఫాల్ బారియర్ పని పూర్తయింది. 29,776 చదరపు మీటర్ల వైర్ మెష్ నెట్టింగ్, 22,197 మీటర్ల రాక్ బోల్టింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 346 రంధ్రాలు తవ్వి 40 రంధ్రాలకు గ్రౌటింగ్ వంటి క్షేత్రస్థాయి కార్యకలాపాలు చేపట్టారు. దీంతో పాటు, అదనపు వాలు రక్షణ కోసం ప్రమాదకర ప్రదేశాలలో 300 చదరపు మీటర్ల రాంబాయిడల్ మెష్ మరియు 730 చదరపు మీటర్ల మోనో ఓరియంటెడ్ మెష్‌ను పరిచారు.
కేకే – 2 సెక్షన్‌లో రక్షణ పనులు
కేకే – 2 సెక్షన్‌లో లక్ష్య నిర్ధారిత రక్షణ కార్యకలాపాలు పూర్తి చేశారు. ఈ మార్గంలో 120 మీటర్ల రాక్ ఫాల్ బారియర్ పని పూర్తి చేశారు. ఈ సెక్షన్ లోని బలహీనమైన కొండ కోతల నుంచి రక్షణ కోసం 4,200 చదరపు మీటర్ల వైర్ మెష్ నెట్టింగ్ పనులు చేపట్టారు.
కేఆర్ సెక్షన్‌లో సుస్థిర పురోగతి
కొరాపుట్ – రాయగడ (కేఆర్) సెక్షన్ లో రక్షణ పనులు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో 300 మీటర్ల రాతిపతన నిరోధక పనులు, 1,600 మీటర్ల రాతి బోల్టుల పనులు పూర్తి చేయడంతో రెండు విభాగాలలోనూ 100 శాతం ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసినట్లు ప్రకటించారు. అదనంగా 10,000 చదరపు మీటర్ల వైర్ మెష్ నెట్టింగ్ కూడా పూర్తయింది. కొండ వాలు మార్గాల గుండా కొనసాగే రైళ్ల కార్యకలాపాల్లో అవాంతరాలు తొలగించేందుకు వదులుగా ఉన్న రాళ్ల కదలికలను పటిష్టపరిచేందుకు వైర్ మెష్ నెట్టింగ్ చేశారు.
ఆర్వీ సెక్షన్ లో రక్షణ పనులు
రాయగడ–విజయనగరం (ఆర్‌వి) సెక్షన్ లో లంజిగఢ్ రోడ్, రాయగడ మధ్య ఉన్న ప్రమాదకరమైన మలుపుల్లో రక్షణ పనులు ప్రాధాన్యత ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ నెల 30 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్ధారించారు.
కేఆర్ సెక్షన్ లో సొరంగాల పటిష్టత
కేఆర్ సెక్షన్ పరిధిలోని సొరంగాలలో భద్రతను పటిష్టత కార్యకలాపాలు చేపట్టారు. ఈ మార్గంలో 3 సొరంగాలను బలోపేతం చేసేందుకు టెండర్ కేటాయించారు. పనులు కొనసాగే సమయంలో అవాంఛనీయ సంఘటనలు నివారించేందుకు రైళ్ల రవాణా, ఈ మార్గంలో రైలు విద్యుద్దీకరణ నియంత్రణ వంటి జాగ్రత్తలకు ఉత్తర్వులు జారీ చేశారు.
అధ్యయనాలపై శ్రద్ధ
ప్రమాదకరమైన ప్రదేశాలలో దీర్ఘకాలిక భద్రత కోసం సుస్థిరమైన నివారణ చర్యలను గుర్తించడానికి భూగర్భ, భూభౌతిక అధ్యయనాల పట్ల దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేకే, కేఆర్ సెక్షన్లలోని ఇతర ప్రమాదకరమైన మలుపుల్లో భూగర్భ సర్వే రైల్వే శాఖ ప్రారంభించింది. తన కీలకమైన ఘాట్ విభాగాలలో ఉభయ ప్రయాణీకులు, సరుకు రవాణా రంగాల్లో సురక్షిత నిరంతరాయ రైలు కార్యకలాపాల కోసం మౌలిక సదుపాయాల భద్రత, ఆధునీకరణ, విపత్తు సన్నద్ధతకు తూర్పు కోస్తా రైల్వే అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుంది.


