జూన్‌ 30 నాటికి రథయాత్ర సన్నాహాలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 30 నాటికి రథయాత్ర సన్నాహాలు పూర్తి

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

భువనేశ్వర్‌: పూరీలో జరగనున్న వార్షిక రథయాత్ర సన్నాహాలను ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్‌ సమీక్షించారు. ఆమె అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రథయాత్ర సజావుగా జరిగేందుకు మిగిలిన పనులను జూన్‌ 30 లోగా పూర్తి చేయాలని ఆమె అన్ని శాఖలను ఆదేశించారు. ఏప్రిల్‌లో జరిగిన మునుపటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షిస్తూ ఈ ఏడాది జూలై 16న జరగనున్న శ్రీ గుండిచా యాత్రకు ముందు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అనూ గర్గ్‌ తెలిపారు. సమన్వయంతో సమర్థంగా పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసేందుకు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. రథాల నిర్మాణం ప్రణాళిక ప్రకారం పురోగమిస్తోంది. మూడు రథాలకు అవసరమైన కలప నిర్దేశిత కాలపరిమితిలోగా పూరీకి చేరుకుంటుందని ఎస్‌.జే.టీ.ఏ తెలియజేసింది. పూరీ కలెక్టర్‌ దివ్యజ్యోతి పరిడా, పోలీస్‌ సూపరింటెండెంట్‌ ప్రతీక్‌ సింగ్‌ వివిధ సన్నాహక పనుల స్థితిపై వివరణాత్మక నివేదికలను సమర్పించారు. ప్రధాన కార్యదర్శి పూరీ, గ్రాండ్‌ రోడ్‌ (బొడొ దండొ)లను కలిపే రహదారి అభివృద్ధి ప్రాజెక్టులు, పార్కింగ్‌ సౌకర్యాలు, తాత్కాలిక పారిశుధ్య మౌలిక సదుపాయాలు, తాగు నీటి సరఫరా, విద్యుత్‌ ఏర్పాట్లు, రవాణా నిర్వహణ, జనసందోహం నియంత్రణ చర్యలు, శాంతి భద్రతల ఏర్పాట్లను సమీక్షించారు. సంబంధిత శాఖలకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. రథయాత్ర సమయంలో అత్యవసర రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రత్యేక అంబులెన్స్‌ మార్గం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. బొడొ దండొ వెంబడి హై మాస్ట్‌ లైట్ల ఏర్పాటు జరుగుతుండగా శ్రీ గుండిచా ఆలయం వద్ద సుందరీకరణ పనులు, సముద్ర తీర రహదారి వెంబడి రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులు పురోగమిస్తున్నాయి. యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నందున వారికి వసతులు కల్పించేందుకు పరిపాలన యంత్రాంగం సమంగ్‌లో బయో టాయిలెట్లతో పాటు పార్కింగ్‌ సౌకర్యాలను కూడా అభివద్ధి చేస్తోంది. ఆరోగ్య శాఖ పడకలతో కూడిన అదనపు తాత్కాలిక ఆరోగ్య కేంద్రాల కోసం ప్రదేశాలను గుర్తించగా, పనుల శాఖ, పూరీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తాత్కాలిక పార్కింగ్‌ జోన్‌లను కేటాయించి, అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. బొడొ దండొ వెంబడి దశల వారీగా ఆక్రమణల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీటిని నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేస్తామని పూరీ జిల్లా యంత్రాంగం తెలిపింది. 1,600 తాత్కాలిక మరుగు దొడ్ల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. యాత్రకు ముందే ఈ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ప్రధాన డ్రైన్‌లు, వాటికి అనుసంధానమైన మురుగు నీటి కాలువల్లో పూడికతీత పనులు త్వరలో పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు. వార్షిక రథ యాత్ర సందర్భంగా పూరీని సందర్శించే లక్షలాది మంది భక్తులకు సురక్షితమైన, క్రమబద్ధమైన, అవాంతరాలు లేని రథ యాత్ర అనుభవాన్ని అందించడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని సమావేశం నొక్కి చెప్పింది. లోక్‌ సేవా భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) హేమంత్‌ శర్మ, శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (ఎస్‌ జేటీఏ) ప్రధాన నిర్వాహకుడు, అదనపు ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ) డాక్టర్‌ అరవింద కుమార్‌ పాఢి, పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ వై. బి. ఖురానియా, అగ్ని మాపక సేవల డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సుధాన్షు షడంగి, తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్‌ మండల అధికారి డీఆర్‌ఎమ్‌ డి.సునీల్‌, సీనియర్‌ ప్రభుత్వ కార్యదర్శులు, పోలీసు అధికారులు, పూరీ జిల్లా పరిపాలన అధికారులు హాజరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement