కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క కొరాపుట్ జిల్లాలోని కొరాపుట్, పొట్టంగి నియోజకవర్గాల్లో గురువారం పర్యటించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర ఖడంతో కలిసి ఈ పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లని సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలుచోట్ల కార్యకర్తలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి రానున్న పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని దిశా నిర్దేశం చేశారు. పర్యటనలో ఆయనతో పాటు కొరాపుట్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రుపక్ తురుక్ ఉన్నారు.
బైక్ సైలెన్సర్లు ధ్వంసం
కొరాపుట్: శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న బైక్ సైలెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణంలో పలుచోట్ల రహస్యంగా మాటువేసి ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. ఇందులో 32 వాహనాలని సీజ్‌చేసి కోర్టుకి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు సైలెన్సర్లని తొలగించి రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ఇదే ఘటనలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మరో 12 మందిపై రూ.10 వేలు చొప్పున జరిమాన విధించామని ఐఐసీ సంబిత్ బెహరా ప్రకటించారు.
హత్య కేసులో నిందితుడు అరెస్ట్
కొరాపుట్: మహిళపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నబరంగ్‌పూర్ జిల్లా ఎస్పీ పార్ధవ్ కశ్యప్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. జిల్లాలోని కొడింగా పోలీస్‌స్టేషన్ పరిధి చంచర్‌గుడ గ్రామంలో చంద్ర బోత్ర (22)ని గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయంపై ఆమె సోదరుడు పులిషింగ్ బోత్ర కొడింగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్, సైంటిఫిక్ బృందాలు తమ పరిశోధన చేశాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మృతురాలి పక్కింటికి చెందిన దశరథి మజ్జిని అదుపులో తీసుకున్నారు. సంఘటన స్థలంలో దొరికిన అధారాలతో దర్యాప్తు చేశారు. పోలీసులు వద్ద నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. వెంటనే నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకి తరలించారు.
విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి
భువనేశ్వర్: వేసవి సెలవులు పూర్తి కావడంతో గురువారం పలు చోట్ల పాఠశాలలు తెరిచి తరగతుల నిర్వహణ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద గోండ్ ప్రభుత్వ పాఠశాల సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్శనలో భాగంగా ఉమర్‌కోట్‌లో భలుగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కొంత సమయం గడిపారు. పిల్లలకు బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు. పాఠశాలలోని బోధన, ఇతర సంబంధిత ఏర్పాట్ల గురించి ఉపాధ్యాయులతో వివరంగా చర్చించారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలకు తిరిగి వచ్చిన విద్యార్థులలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం, ఆసక్తి కనబడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. అనుకూలమైన పర్యావరణంలో బాలలకు నాణ్యమైన విద్య బోధనకు ఉన్నత సౌకార్యలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి ప్రకటించారు.


