నిషేధిత వస్తువుల స్వాధీనం
రాయగడ: ఝార్సుగడ జైలులో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయడంతో పాటు ఖైదీల వద్దకు నిషేధిత వస్తువులు చేరకుండా నిరోధించేందుకు ఝార్సుగుడ జిల్లా ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో జైలు ప్రాంగణంలోని బ్యారక్‌లు, సాధారణ ప్రదేశాలు, ఖైదీల వ్యక్తిగత సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా ఖైదీల వద్ద నుంచి బీడీలు, పొగాకు ఉత్పత్తులు, గుట్కా ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు, రేజర్ బ్లేడ్లు, లైటర్ వంటి నిషేధిత వస్తువులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులు జైలు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో అధికారులు వాటిని వెంటనే జప్తు చేశారు. అదేవిధంగా జైలులో అమలవుతున్న భద్రతా చర్యలు, సీసీ టీవీ కెమెరాల పనితీరు, ఖైదీల నిర్వహణ విధానం, సందర్శకుల పర్యవేక్షణ వ్యవస్థలపై కూడా సమగ్ర సమీక్ష చేపట్టారు. జైలు భద్రతతో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జైలు అధికారులను ఎస్పీ రాఘవేంద్ర పలు సూచనలు చేశారు. జైల్లో అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా చేయడం, ఖైదీల భద్రతతో పాటు శాంతి భద్రతలను పరరిక్షించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగించి జైలు భద్రతను మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు.


