సుదర్శన్‌ పట్నాయక్‌కు గవర్నర్‌ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

సుదర్శన్‌ పట్నాయక్‌కు గవర్నర్‌ అభినందనలు

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

భువనేశ్వర్‌: రష్యాలోని కలినిన్‌ గ్రాడ్‌ ప్రాంతంలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్పకళా ఉత్సవంలో ప్రతిష్టాత్మకమైన రష్యన్‌ గ్రాండ్‌ సాండ్‌ మాస్టర్‌ కప్‌–2026ను గెలుచుకుని తిరిగి వచ్చిన పద్మశ్రీ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ సైకత కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ను గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి లోక్‌ భవన్‌లో బుధవారం సత్కరించారు. ఈ విజయం ఒడిశాకు, దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టిందని, ప్రపంచ వేదికపై కళలు, సంస్కృతి రంగంలో భారత దేశ ఖ్యాతిని మరింత పెంచిందని గవర్నరు కొనియాడారు. ప్రపంచ సవాలుగా నిలిచిన వాతావరణ మార్పులు మానవాళిపై చూపుతున్న ప్రభావాన్ని ప్రతిబింబించిన సైకత కళాఖండంతో సుదర్శన్‌ పట్నాయక్‌ అవార్డు గెలుచుకోవడం పట్ల ప్రశంసించారు. సామాజిక, పర్యావరణ సందేశాలను తెలియజేయడానికి, తీవ్రమైన ప్రపంచ సమస్యలపై అవగాహన కల్పించడానికి కళను ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవడంలో శిల్పి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను గవర్నరు ప్రశంసించారు.

పండిత గోపబందు దాస్‌కు నివాళులు

జయపురం: సమాజ సేవకుడు, న్యాయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజనీతిజ్ఞుడు పండిత గోపబందు దాస్‌ 98వ వర్ధంతిని జయపురంలో పలు సంస్థలు బుధవారం నిర్వహించాయి. ఈ సందర్భంగా స్థానిక పూజ్య పూజా సంసద్‌ సంస్థ ఆధ్వర్యంలో దాస్‌కు ఘన నివాళులర్పించారు. స్థానిక రాజనగర్‌ కూడలిలోని గోపబందు దాస్‌ ప్రతిమకు పూజ్య పూజ సంసద్‌ ఉపాధ్యక్షులు తపణ కిరణ త్రిపాఠీ పూల మాలలు వేసి నివాళులర్పించాచారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రత్యేక ఉత్కళరాష్ట్ర ఉద్యమంలో స్వర్గీయ దాస్‌ భూమిక చిరస్మరణీయమన్నారు. అతడు న్యాయవాదిగా, సమాసేవిగా, ఉపాధ్యాయుడిగా, సంఘసంస్కర్తగా రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో సంసద్‌ సభ్యులు కై ళాశ చంధ్ర బిశ్వాల్‌, నవీణ చంధ్ర మఝి పాల్గొన్నారు.

24 నుంచి బ్రహ్మోత్సవాలు

రాయగడ: ఈ నెల 24వ తేదీ నుంచి స్థానిక బాలాజీ నగర్‌లో పూజలందుకుంటున్న కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరం 32వ వార్షికోత్సవంతోపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మందిరం ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యులు ఆధ్వర్యంలో కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతాయి. 24వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనం, తదితర పూజలు, నీరాజన, ప్రసాద వితరణ, 25వ తేదీ ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, పతాక ధ్వజ ప్రతిష్టాపనలు, గరుడధ్వజారోహణం, ఉదయం 9 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతాలు, సాయంత్రం 5 గంటలకు ఎదుర్కొలు ఉత్సవం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, రాత్రి 8 గంటలకు శ్రీవారి శేషవాహనోత్సవం, 26వ తేదీన ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ, పూజా కార్యక్రమాలు, ఉదయం 9 గంటలకు శ్రీలక్ష్మీ ఇష్టి, సాయంత్రం 6 గంటలకు శ్రీవారి హనుమంత వాహనోత్సవం, రాత్రి 8 గంటలకు సహస్ర దీపాలాంకృత ఊంజల్‌ సేవ, నీరాజన మంత్ర పుష్పములు, 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు గజవాహనోత్సవం, వేంకటేశ్వర స్వామి వ్రతాలు, తదితర పూజలు, 28వ తేదీ సాయంత్రం గరుడ వాహనోత్సవం, 29వ తేదీ ఉదయం 7 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, శ్రీవారి అష్టోత్తర, కలశాభిషేకం, చక్రతీర్థం, తదితర పూజాలతో ఉత్సవాలు ముగుస్తాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement