ఎన్నాళ్లీ ఎదురుచూపులు? | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ఎదురుచూపులు?

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

రాయగడ: సామాజిక పింఛన్‌ కోసం వేలాది మంది లబ్ధిదారులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వృద్ధాప్యం, వైకల్యం, భర్తను కోల్పోయిన వారు.. ఇలా అనేక మంది జీవనాధారం కోసం ప్రభుత్వ భత్యాలే ఆశగా నిరీక్షిస్తున్నా పాలకులు కరుణ చూపడం లేదు. స్వాతంత్య్రానికి ముందే జన్మించిన 82 ఏళ్ల హసాయ్‌ బాగ్‌ (అంబొదళ గ్రామం ఇంద్రాపడ వీధి), రాయగడ పట్టణానికి చెందిన వితంతువు విష్ణుప్రియ బాగ్‌, మునిఖాల్‌ , కళ్యాణసింగుపూర్‌ సమితిలోని దివ్యాంగురాలు రుక్మిణి, బొనిత్‌ మహంతి, సురుగాలి సొమేశ్వరరావు, కారశిక గ్రామానికి చెందిన సుదర్శన్‌ వంటి వేలాది మంది అర్హులు సంవత్సరాల పాటు పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయాలు పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ భత్యాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. జిల్లా కలెక్టర్‌ ప్రజా ఫిర్యాదుల విభాగం నుంచి సమితి కార్యాలయాలు, సర్పంచ్‌ల వరకు పలుమార్లు తిరిగినా సమస్యలకు పరిష్కారం లభించడం లేదని బాధితులు వాపోతున్నారు. వైద్యబోర్డు, సామాజిక భద్రత, దివ్యాంగుల సాధికారత శాఖల ధ్రువీకరణ పూర్తయినప్పటికీ, ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి జిల్లాలో మొత్తం 9,462 మంది అర్హులైన లబ్ధిదారులు పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. సమితుల వారిగా కాసీపూర్‌లో అత్యధికంగా 2,699 మంది, కొలనారలో 1,705 మంది, రాయగడలో 1656 మంది, బిసంకటక్‌లో 697 మంది, గుణుపూర్‌లో 538 మంది, కళ్యాణసింగుపూర్‌లో 508 మంది, మునిగుడలో 412 మంది, గుడారిలో 351 మంది, పద్మపూర్‌లో 262 మంది సామాజిక పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక మున్సిపాలిటీ పరిధిలోనే 434 మంది ప్రభుత్వ కరుణ కోసం వేచి ఉన్నారు.

సీఎం ప్రకటించినా..

గత బడ్జెట్‌లో అర్హులైన ప్రతి లబ్ధిదారుకీ వెంటనే పింఛన్‌ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి గతంలో ప్రకటించారు. అయినప్పటికీ ఆ హామీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పంపిణీ జరుగుతున్న పింఛన్లలోనూ పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. మరణించిన వ్యక్తులు, అనర్హుల పేరిట కూడా పింఛన్లు విడుదలవుతున్నాయని రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా సంబంధిత శాఖ మంత్రి వెల్లడించారు. అర్హులను గుర్తించి భత్యాలు అందించడంతో పాటు అక్రమ లబ్ధిదారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించినా ఆ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం రాయగడ జిల్లాలో జాతీయ సామాజిక సహాయం పథకం కింద 70 వేల మందికి పైగా, మధుబాబు పెన్షన్‌ పథకం కింద 82 వేల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నట్లు సామాజిక భద్రత శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

పింఛన్‌ కోసం ఆశగా లబ్ధిదారుల నిరీక్షణ

రాయగడ జిల్లాలో

9,462 మంది అర్హులకు అందని సామాజిక భద్రత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement