● 132 కేంద్రాల్లో ‘నీట్‌’ | - | Sakshi
Sakshi News home page

● 132 కేంద్రాల్లో ‘నీట్‌’

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

భువనేశ్వర్‌: ఈ నెల 21న జరగనున్న నీట్‌ యూజీ 2026 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పరీక్ష ప్రక్రియను అవాంతరాలు తలెత్తకుండా పూర్తి చేసేందుకు పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోందని, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 132 కేంద్రాల్లో నీట్‌ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాలకు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, సీసీటీవీ నిఘా, బ్యాంక్‌ లాకర్లలో ప్రశ్నపత్రాల భద్రత, కేంద్ర ప్రాంగణం లోపల, వెలుపల శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందన ఏర్పాట్లపై సమీక్షించారు. తప్పుడు సమాచారం, పుకార్ల వ్యాప్తిపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని డీజీపీ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లను ముందుగానే పరీక్షించి, ధృవీకరించుకోవాలని అధికారులను కోరారు.

పరీక్ష తర్వాత పరీక్షా కేంద్రాల నుంచి ఓఎంఆర్‌ షీట్లను సేకరించి నిర్దేశిత సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సంబంధించిన సూచనలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షకు సంబంధించి ఎలాంటి అవకతవకలు, అవినీతి కార్యకలాపాలు లేదా భద్రతా లోపాలను సహించబోమని డీజీపీ స్పష్టం చేశారు. ఎస్పీలందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో క్రైమ్‌ బ్రాంచ్‌ డీజీ బినయతోష్‌ మిశ్రా, శాంతిభద్రతల అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సంజయ్‌ కుమార్‌, ఐజీ సెంట్రల్‌ డాక్టర్‌ సత్యజిత్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement