● నలుగురు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలోని పోత్‌కాల్ కాలనీ వద్ద దుప్పట్ల వ్యాపారం పేరుతో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు దుప్పట్ల వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చారు. అయితే వ్యాపారం ముసుగులో గంజాయిని సేకరించి రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి సహకారంతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనిపై కలిమెల పోలీసులకు పక్కా సమాచారం చేరడంతో ఐఐసీ ప్రభుదత్తు తన సిబ్బందితో బుధవారం ఆకస్మిక దాడి చేసి నలుగురిని పట్టుకొని రవాణాకు సిద్ధంగా ఉన్న గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తూకం వేయగా వంద కిలోలు ఉంది. దీని విలువ రూ. పది లక్షలు ఉంటుందని ఐఐసీ ప్రభుదత్తు విలేకరులకు తెలిపారు. నిందితులకు కలిమెల సమితి దారగూఢ గ్రామానికి చెందిన ఇర్మ పడియామి అనే వ్యక్తి సహకరించడంతో అతన్ని కూడా అరెస్టు చేశామన్నారు. అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన జీసాన్ మహ్మద్, అవతాబ్ అలీ, అర్మాన్ ఖాన్ ఉన్నారు. వీరివద్ద నుంచి మూడు బైక్‌లు, సేల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోని కేసు నమోదుచేసి కోర్టుకు తరలించామని ఐఐసీ ప్రభుదత్తు తెలిపారు.


