నీట్‌ రీ ఎగ్జామ్‌ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం | - | Sakshi
Sakshi News home page

నీట్‌ రీ ఎగ్జామ్‌ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

రాయగడ: ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్‌ (యూజీ) రీ ఎగ్జామినేషన్‌ –2026లో పాల్గొనే విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి ఆదేశాల మేరకు పరీక్షార్థుల కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని దూర ప్రాంతాలు, సమితులు, గ్రామ పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. వీరందరికీ పరీక్ష కేంద్రంగా రాయడలోని కేంద్రీయ విద్యాలయం పాఠశాలను నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం విడుదల చేసిన రూట్‌ మ్యాప్‌ ప్రకారం గుణుపూర్‌, పద్మపూర్‌, కొలనార, కాసీపూర్‌ ,మునిగుడ, రాయగడ పట్టణం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పెర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఉదయం వేళల్లోనే బస్సులు బయలుదేరనున్నాయి. పరీక్షా ముగిసిన 30 నిమిషాల తరువాత తిరుగు ప్రయాణానికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.

బస్సుల తిరుగు సమయాలు..

గుణుపూర్‌ నుంచి రామనగుడ మార్గంలో ఉదయం 7 గంటలకు, గుముడ మార్గంలో ఉదయం 8 గంటలకు బస్సులు బయలుదేరి ఉదయం 10.30 గంటలకు, 11.30 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకుంటాయి. పద్మపూర్‌ నుంచి గుముడా మార్గంలో ఉదయం7 గంటలకు బయలుదేరే బస్సు 10.30 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరకుంటుంది. కొలనార నుంచి జేకేపూర్‌, రైల్వే స్టేషన్‌ మార్గంగా ఉదయం 8 గంటలకు బయలుదేరే బస్సు 10.30 గంటలకు చేరుతుంది. కాసీపూర్‌ నుంచి టికిరి మార్గంగా ఉదయం 7 గంటలకు బయలుదేరే బస్సు 10 గంటలకు కేంద్రీయ విద్యాలయానికి చేరుతుంది. మునిగుడ నుంచి బిసంకటక్‌ మార్గంగా ఉదయం 7 గంటలకు బయలుదేరే బస్సు కూడా 10 గంటలకు చేరుకుంటుంది. రాయగడ పట్టణం నుంచి రైల్వే స్టేషన్‌ మార్గంగా ఉదయం 10 గంటలకు, 11 గంటలకు రెండు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు యంత్రాంగం వెల్లడించింది. ఇవి వరుసగా 10.30 గంటలకు, 11.30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకుంటాయి. పరీక్ష ముగిసిన అనంతరం 30 నిమిషాల తరువాత అన్ని బస్సులు తిరిగి ఆయా ప్రాంతాల నుంచి బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు.

పర్లాకిమిడిలో భారీ వర్షం

పర్లాకిమిడి: పట్టణంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు కుండపోత వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. రెండు రోజులుగా ఉక్కపోతతో సతమవుతున్న సమయంలో ఉదయం గంట సమయం వర్షం కురవడంతో వాతావరణంలో మార్పు కనిపించింది. రాయఘడ, జిరంగో, కోయిపూర్‌, మహేంద్రంలో వర్షం కురిసింది. మహేంద్రతనయ నదిలో వర్షం నీరు చేరింది.

నదిలో బియ్యం బస్తాల ట్రక్‌ బోల్తా

రూ. 5 లక్షల సరుకు నీటిపాలు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి పంగం గ్రామం వద్ద ఉన్న నదిలో బుధవారం బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రక్‌ బోల్తా పడింది. మల్కన్‌గిరికి చెందిన కనకదుర్గ రైస్‌మిల్‌ నుంచి జయపురం ఎఫ్‌సీఐ గొడౌన్‌ 580 బియ్యం బస్తాలతో ట్రక్కు వెళ్తుంది. అయితే వంతెన వద్ద అదుపుతప్పి నదిలో బోల్తా పడ్డింది. ఈ ఘటనలో డ్రైవర్‌ చాకచక్యంగా ప్రాణాలతో బయటకు దూకేశాడు. విషూయాన్ని తన యజమాని పి.సాయికు తెలియజేశాడు. ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ట్రక్‌ను బయటకు తీయించే ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న మాత్తిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. కాగా నీట మునిగిన బియ్యం పూర్తిగా నానిపోవడంతో సుమారు. రూ. 5 లక్షలు నష్టవాటిల్లిదని మిల్లు జయమాని తెలిపారు.

జూద శిబిరాలపై దాడి

పర్లాకిమిడి: పట్టణంలో ఆదర్శ పోలీసు స్టేషన్‌ అధికారులు జూదశిబిరాలు, పబ్లిక్‌ స్థలాల్లో మద్యపానం, బైక్‌ చోరీలపై దాడులు చేపట్టారు. మోడల్‌ పోలీసు స్టేషన్‌ అధికారి (ఐఐసి) ప్రశాంత్‌ భూపతి మంగళవారం రాత్రి ఆంధ్ర– ఒడిశా సరిహద్దు కెరండీ గ్రామం సమీపంలో డాలింబపూర్‌ అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న జూద శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. మరో 20 మంది పోలీసుల రాక గమనించి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రూ. 17,800, మూడు ఫోన్లు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పర్లాకిమిడి పరిధిలో శాంతి భద్రతలు విఘాతం కల్పిస్తున్న కొంతమంది మహేంద్ర తనయ నది ఒడ్డున బి.ఎన్‌.ప్యాలస్‌ వద్ద రాత్రి మద్యపానం చేస్తున్నవారిపై పెట్రోలింగ్‌ సిబ్బంది దాడులు జరిపి పది మందిని అరెస్టు చేశారు. వారిని కూడా ఆదర్శ పోలీసు ష్టేషన్‌కు తీసుకువచ్చి హెచ్చరించి రాతపూర్వక లేఖలు తీసుకుని విడిచిపెట్టామని ఐఐసీ తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement