● యువకుడు, యువతిపై
గ్రామస్తుల దాడి
● ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రాజ్ ప్రసాద్
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ ప్రాంతంలోని ఓ గ్రామంలో పిల్లలను ఎత్తుకెళ్లే వారని అనుమానిస్తూ ఓ యువకుడు, యువతిపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ ప్రాంతానికి చెందిన సుమన్ ఝా, గుజరాత్‌లోని సూరత్ ప్రాంతానికి చెందిన అర్పిత సుతారియాలు కొన్నాళ్లుగా కంధమాల్ జిల్లా దారింగిబాడిలో ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి పనిమీద గూగుల్ మ్యాప్ సహాయంతో దారింగిబడి నుంచి స్కూటీపై కలహండి జిల్లా థువామూల్‌రాంపూర్ వెళ్లారు. అయితే అటువైపుగా రహదారి సరిగ్గా లేదని కొందరు చెప్పడంతో తిరిగి అదే దారిలో వస్తుండగా కొందరు అడ్డగించారు. పిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగ్‌కు చెందిన వారని ప్రచారం చేస్తూ సుమారు 12 కిలోమీటర్లు వెంబడించారు. కళ్యాణసింగుపూర్ ప్రాంతానికి మంగళవారం రాత్రి చేరుకున్న సమయంలో దాడి చేసేందుకు ప్రయత్నించగా ప్రాణభయంతో ఇద్దరూ కల్యాణసింగుపూర్ విద్యుత్ కార్యాలయంలో దాక్కున్నారు. పిల్లల చోరీ గ్యాంగ్ ఇక్కడికి వచ్చిందని వెంబడించిన వారు కేకలు వేయడంతో గ్రామస్తులంతా అక్కడకు చేరుకుని ఇద్దరిపైనా దాడి చేశారు. అనంతరం కొందరు విడిపించి బాధితులను కళ్యాణసింగుపూర్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడికి కూడా గ్రామస్తులు చేరుకుని నానా రభస సృష్టించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ రాజ్‌ప్రసాద్, ఎస్‌డీపీఓ గౌరహరి సాహు, కళ్యాణసింగుపూర్ ఐఐసీ కల్పన బెహరా ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అనంతరం యువతీ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


