రైతుల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

రైతుల రాస్తారోకో

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ కుంధ్రా సమితిలో మండీల్లో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లకు అథారిటీ లేఖలు ఇవ్వనందుకు నిరసనగా కుంద్రా సమితి రైతులు సోమవారం కుంద్రాలో రాస్తారోకో నిర్వహించారు. కుంద్రా సమితి పరిధిలో పుప్పుగాం, డొంగరపంశి మండీల ఆధీనంలోగల రైతులు ధాన్యం అమ్మేందుకు ధాన్యం తీసుకెళ్లగా మండీల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లకు అథారిటీ లేఖలు లేవని తెలిసిందని రైతులు వెల్లడించారు. ఇది కొనుగోలు సంస్థలు, సివిల్‌ సప్‌లై అధికారుల కుట్రగా ఆరోపిస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులు రెగ్యులేటింగ్‌ మార్కెటింగ్‌ కేంద్రం ముందు టైర్లు కాల్చుతూ ఆందోళన జరిపారు. ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే 8 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసేందుకు నలుగురు మిల్లర్లకు అథారిటీ లేఖలు అందజేయగా రైతులు శాంతించి రాస్తారోకో విరమించారు. కుంధ్రా సమితిలో 9 స్థానాల్లో ఖరీఫ్‌ మండీలు ఏర్పాటు చేశారని, అయితే అధికారులు మిల్లర్లకు సకాలంలో అథారిటీ లేఖలు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం కొనలేదని తెలిపారు. ఈ పరిస్థితికి కారణం అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

పాముకాటుతో యువకుని మృతి

రాయగడ: జిల్లాలోని కల్యాణసింగుపూర్‌ సమితి పారామలి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పాముకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని గ్రామానికి చెందిన లత్కా సికక కుమారుడు సేత్ర సికక (25) గా గుర్తించారు. మునిగుడ సమితిలోని సనొడెంగుణి గ్రామంలొ జరిగిన వివాహ వేడుకకు సికక హాజరయ్యాడు. కార్యక్రమం రాత్రి ఆలస్యంగా ముగియడంతో స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా గ్రామానికి సమీపంలొ గల అతని స్నేహితులతో కలసి బస చేశాడు. ఆదివారం ఆర్ధరాత్రి గాడనిద్రలో ఉన్న అతడిని ఒక పాము కాటు వేసింది. దీంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూతబడిన పార్వతీదేవి మందిరాలు

పర్లాకిమిడి: రొజ్జో పండుగ సందర్భంగా పలు శైవమందిరాల్లో ఉన్న పార్వతీదేవి మందిరాలను సోమవారం మూసివేశారు. ఏడాదికి ఒక్కసారి భూదేవికి కలిగే రుతుక్రమం సందర్భంగా అన్ని గౌరీ, శక్తి పీఠాల్లో పార్వతీదేవి మందిరాలు మూడు రోజులు మూసివేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పర్లాకిమిడిలో పలు దేవాలయాల్లో పార్వతీదేవి మందిరాలను మూసివేసి సంప్రదాయాన్ని పాటించారు. అలాగే ఒడియా ప్రజలు మూడు రోజుల పాటు ఇంట్లో పూజలు సైతం చేయరు.

ఉత్సవాలు మన సంస్కృతికి దర్పణాలు

జయపురం: మన జానపద సంస్కృతి, సంప్రదాయం, సామరస్యానికి దర్పణం రొజ్జో సంక్రాంతి అని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీ పతి అన్నారు. మూడు దినాల కిశోరీలు నియమ నిబంధనలతో జరుపుకునే రోజా సంక్రాంతి సందర్భంగా జయపురంలో నిర్వహించిన రొజ్జో కిశోర్‌ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పండగలు జరుపుకోవడం ద్వారా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కిశోరీలతో కలసి సంప్రదాయ మిఠాయిలు, పిఘాలతో పాటు రొజ్జో పాన్‌(కిళ్లీ)లను ఆస్వాదించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement