రాయగడ: ఝార్సుగుడ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, వీధి నేరాల నియంత్రణ, సంఘవిద్రోహ కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు విస్తృతస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సాయంత్రం బైక్ పెట్రోలింగ్‌కు శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర బైక్ పెట్రోలింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తొలిరోజున బైక్‌పై వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తూ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్ జిల్లాలోని పలు కీలక ప్రాంతాలను రోజూ కవర్ చేస్తుందని అన్నారు. జిల్లాలోని ప్రధానంగా సర్బహల్, సొనారిముండా, మన్మోహన్ ఫీల్డ్, జడేశ్వర్ ఆలయం, బొంబాయి కూడలి తదితర ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. పెట్రోలింగ్ సందర్భంగా పోలీసులు ప్రజలతో మమేకమై భద్రతా అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశమున్న వ్యక్తులపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జార్సుగుడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 మంది, సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో 20 మంది మందిని పీఆర్ బాండ్లపై బౌండ్‌డౌన్ చేశారు. భవిష్యత్‌లో శాంతి భద్రతలకు భంగం కలగకుండా నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌కు ఝార్సుగుడ ఎస్పీ నాయకత్వం వహించగా ఎస్‌డీపీవో, టౌన్ ఐఐసీ, సదరు ఐఐసీతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో శాంతిభద్రత, ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.


