రాయగడ: జిల్లాలోని కాసీపూర్ పోలీసుల అప్రమత్తమత్తంగా వ్యవహరించడంతో ఒక భారీ దోపిడీ కుట్రను భగ్నమైంది. ప్రాణాంతకరమైన మరణాయుధాలతో దోపీడీకి సిద్ధమవుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన ఆసక్మిక దాడిలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి కత్తి, ఇనుపరాడ్లు, వెదురు కర్రలు, మిరపపొడి ప్యాకెట్లు, మద్యం సీసాలు, మోటార్ సైకిల్‌తో పాటు గతంలో జరిగిన చోరీ కేసులకు సంబధించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున కాసీపూర్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కాసీపూర్ సమీపంలోని శివాలయం శివారులో కొందరు వ్యక్తులు మారణాయుధాలతో అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు ఇతర సిబ్బందిని రప్పించి వారిపై మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కాసీపూర్‌లోని హరిజన్ వీధికి చెందిన డొంబురుధర్ నాయక్ అలియాస్ అంకిత్, ధొలు అలియాస్ మనోజ్ నాయక్, బొందొవీధికి చెందిన రబి మాజి, ఆకాష్ బొడొనాయక్, కర్లకుపిలి గ్రామానికి చెందిన భగరీధీ నాయక్ అలియాస్ భొగిలు ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.


