● నృత్య ప్రదర్శనలతో అలరించిన యువత
పర్లాకిమిడి: రొజ్జో పండుగను ఉత్తర ఒడిశాలో అత్యంత ఆడంబరంగా ఆదివారం నుంచి ప్రజలు జరుపుకుంటున్నారు. పర్లాకిమిడిలో రొజ్జో పండగ సందర్భంగా రాజవీధిలోని విశ్వనాథ్ ఫంక్షన్ హాల్‌లో సంబాద్ సాహిత్య 40వ వార్షికోత్సవం సందర్భంగా కవితాపఠనం, ఒడిశా రొజ్జో విశేషాలతో కూడిన నృత్యాలను సంప్రదాయంగా ప్రదర్శించి అలరించారు. ఈ కార్యక్రమంలో ఉత్కళ సమాజ్ అధ్యక్షులు పూర్ణచంద్ర మహాపాత్రో అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా సంబాద్ ఒడియా దినపత్రిక ప్రతినిధి దుర్గామాధవ్ బెహారా, విలేకరి సుజిత్‌కుమార్ బిశోయి, ఒడిశా సాహిత్య అకాడమీ మాజీ సభ్యులు బిచిత్రానంద బెబర్తా, మహిళా కళాశాల రీడర్ డాక్టర్ కళ్యాణీమిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఒడియా వంటకాలు, పోడోఫిఠాలను విచ్చేసిన అతిథులకు అందజేశారు. ఆదివారం పోహాలి రొజ్జో పండుగ సందర్భంగా ఒడిస్సీ నృత్యాలను శ్రీజగన్నాథ కళాకేంద్రం విద్యార్థులు అత్యంత ఆనందంగా డాన్స్ చేసి అలరించారు. అంతర్జాతీయ ఒడిస్సీ నృత్యకళాకారిణీ డి.ప్రియాంక నేతృత్వంలో జరగ్గా.. పలువురు వర్ధమాన కవులు కవితాపఠనంలో పాల్గొని రొజ్జో పండుగ విశేషాలను వివరించారు.
గిరిజన గ్రామాల్లో రోజ్ ఉత్సవాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం రోజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మారిన కాలాన్ని సైతం పక్కనపెట్టి సంప్రదాయంగా వస్తున్న పండుగను వైభవంగా స్థానికులు జరుపుకున్నారు. గిరిజన గ్రామాల్లో చెట్లకు ఊయలలు.. అందులో ఊగుతూ సందడి చేశారు. ఈ పండుగను మూడు రోజులు పాటు నిర్వహిస్తారు.


