రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి మందిరానికి ఆదివారం నాడు భక్తులు పోటెత్తారు. తెల్లవారు 2.30 గంటలకు ఆలయ తలుపులు తీసి హారతి, పూజా కార్యక్రమాలు ముగించి భక్తులకు దర్శనభాగ్యం కలిగించినప్పటికీ అమ్మవారి దర్శనానికి గంటల తరబడి క్యూలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు అమ్మ దర్శనానికి వచ్చినట్లు ఆలయ కమిటీ అంచనా వేసింది. అందుకు సంబంధించి ముందస్తుగానే ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసినప్పటికీ అంచనాకు మించి భక్తులు రావడంతో క్యూలు సరాసరి బయటకు చేరుకున్నాయి. దీంతో భక్తులు అమ్మ దర్శనం కొసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలాఉండగా తెల్లవారు జామునుండే క్యూలో వేచి ఉన్న భక్తుల సంఖ్య పెరగడంతో మిగతా భక్తులు గత్యంతరం లేక ఆరుబయటే పూజలను, తమ మొక్కుబడులను చెల్లించి తిరుగు ముఖం పట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా అమ్మవారి దర్శనానికి రావడంతో మరింత రద్దీ పెరిగింది. వాన కురవడంతో అంతా తడిచిపోయారు.


