రాయగడ: నియమగిరి పర్వత ప్రాంతంలో జల్–జంగిల్–జమీన్ అన్న నినాదంతో వాటి సంరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న నియమగిరి సురక్షా సమితి నాయకుడు లొద్ద సికకను లంజిఘడ్ మున్సిఫ్ కోర్టు పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటిస్తూ.. ఆయన ఆస్తులను జప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డొంగిరియా కొంధొ తెగకు చెందిన లొద్దపై 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈ చర్యలు చేపట్టడం వివాదస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. లంజిఘడ్ మున్సిఫ్ కోర్టు 2017లో నమోదైన కేసు నంబర్ 349/2017ను ఆధారంగా తీసుకుని ఇటీవల సంచలనమైన తీర్పును వెల్లడించింది. ఆ ఉత్తర్వులో లొద్ద సికకను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించడంతో పాటు ఆయనకు సంబంధించిన ఆస్తులను జప్తు చేయడానికి కల్యాణ సింగుపూర్ పోలీస్‌స్టేషన్ ఐఐసీకి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో క్రిమినల్ లా అమాండ్‌మెంట్ యాక్ట్ సెక్షన్–7తో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లు కింద అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై ప్రముఖ సామాజిక కార్యకర్త నరేంద్ర మహంతి మాట్లాడుతూ.. లొద్ద సికకకు తనపై ఇలాంటి క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలియదని, కోర్టు నుంచి ఎటువంటి సమన్లు లేదా వారెంట్‌ను ఆయన స్వీకరించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించడం, ఆస్తుల జప్తునకు ఆదేశించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. న్యాయపూరితమైన పొరాటం చేసేందుకు ఒడిశా హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.


