● డ్రైవర్ మృతి
● పలువురికి గాయాలు
భువనేశ్వర్: 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక యాత్రికుల బస్సు డివైడర్‌ను బలంగా ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం తునాతునకలైంది. ఘటనా స్థలంలో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. బస్సు ప్రయాణికుల్లో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన డ్రైవర్‌ను కె.వెంకటేశ్వర్ (54)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో బి.నారాయణం, బి.సన్నాసమ్మ, ఎం.పద్మ, కె.రామారావు, సుశీల, వి.రాములమ్మ, ఎం. నరసింహం, పి.గోవింద, కె.రంగతేశ్వరం, రాంబాబు, జి.శ్యామ సుందరం ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం ప్రాంతం నుంచి సుమారు 45 మంది యాత్రికులతో బయల్దేరిన శ్రీ లక్ష్మి అనే ప్రైవేట్ బస్సు పశ్చిమ బెంగాల్‌లోని వివిధ పుణ్యక్షేత్రాల సందర్శన పూర్తి చేసుకుని ఒడిశా వైపు వస్తుండగా దుర్ఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్ దిఘా ప్రాంతం పర్యటన ముగించుకుని వస్తుండగా ఆదివారం తెల్లవారు జామున బాలాసోర్ జిల్లా ఖొంతపొడా పోలీసు ఠాణా పరిధిలో 16వ నంబర్ జాతీయ రహదారి బిదు ఆదిరూప పెట్రోల్ పంప్ సమీపంలో బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. అలసటకు గురైన బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. బస్సు ముందు భాగం భారీగా ధ్వంసం కావడంతో దాదాపు సగం మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించి, గాయపడిన వారిని చికిత్స కోసం సొరొ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. గాయపడిన పలువురు యాత్రికుల పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని ఖొంతపొడా పోలీసు ఠాణా అధికారి జీబన్ కుమార్ మల్లిక్ తెలిపారు.


