మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పరిధిలోని సాలబాగాన్ ప్రాంతాంలో ఉన్న విదేశీ మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మహిళలు ఆదివారం నిరసన చేపట్టారు. ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న విదేశీ మద్యం దుకాణాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కోరుతూ సామూహికంగా ఆందోళన నిర్వహించారు. మద్యం దుకాణం కారణంగా స్థానికంగా శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని, మహిళలు, యువతులు తమ భద్రత విషయంలో భయాందోళనకు గురతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రవేశద్వారం వద్ద మద్యం దుకాణం ప్రారంభమైనప్పటి నుంచి స్థానికంగా అసాంఘిక కార్యకలాపాలు పెరిగినట్లు మహిళాలు వాపోయారు. జనావాసాలకు సమీపంలో మద్యం దుకాణం ఉండటంతో పాటు ఉదయం నుంచే తెరవడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అందువల్ల మద్యం దుకాణాన్ని వేరే చోటుకు మార్చాలని కోరారు. ఇదే విషయమై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.


