రాయగడ: గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరిన తమపై పోలీస్ అధికారిణి అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తు గ్రామస్తులు శుక్రవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన ఘటన జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సికరపాయి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం సికరపాయి ప్రాంతంలో రైల్వే శాఖ చేపడుతున్న నిర్మాణ పనుల కారణంగా భారీ వాహనాలు గ్రామం మీదుగా నిరంతరం రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రహదారిపై తీవ్రంగా దుమ్ము ఎగురుతుండటంతో పాటు తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రహదారిపై నీరు చల్లాలని కోరుతూ గ్రామస్తులు కొన్ని వాహనాలను నిలిపివేశారు. ఈ విషయమై సమాచారం అందుకున్న కళ్యాణసింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి కలప్పనా బెహర సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడిన సమయంలొ వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, ఆమె అనుచిత భాషలొ మాట్లాడటంతో ఆగ్రహం చెందిన పరజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో శుక్రవారం రాత్రి నుంచి గ్రామస్తులు కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాయగడ ఎస్‌డీపీఓ గౌరహరి సాహు, చందిలి ఐఐసి ఉత్తమ్ కుమార్ సాహు లు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దారు. దీర్ఘకాలంగా కొనసాగిన ఆందోళన అనంతరం ఐఐసి కల్పన బెహర గ్రామస్తులకు తన ప్రవర్తన తీరుపై క్షమాపణ చెప్పినట్లు సమాచారం.


