భువనేశ్వర్: ఒడిశా కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను డైరెక్టర్ జనరల్ (డీజీ), డీజీ సమాన హోదాలకు నియమించేందుకు కేంద్రం ఎంప్యానెల్ చేసింది. భారత దేశం నలు మూలల నుంచి మరో 31 మంది ఉన్నతాధికారులతో పాటు వీరి పేర్లను కేబినెట్ ఉన్నత స్థాయి నియామకాల కమిటీ ఆమోదించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ భద్రతా, నిఘా వ్యవస్థలలో ఒడిశా అధికారులు ఉన్నత నాయకత్వ పదవులను చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
ఒడిశా అధికారులకు పదోన్నతి
ఒడిశా కేడర్‌కు చెందిన 2 మంది ఎంప్యానెల్డ్ అధికారులు విభిన్న సీనియారిటీ కాలక్రమాలను కలిగి ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అమలు వ్యవస్థలో విస్తృతమైన ట్రాక్ రికార్డులను కలిగి ఉన్నారు. వీరిలో డాక్టర్ సుధాన్షు షడంగి 1990 బ్యాచ్ ఐపీఎస్ సీనియర్ అధికారులలో ఒకరు. ఆయన ప్రస్తుతం ఒడిశా అగ్ని మాపక, అత్యవసర సేవల డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఆయన గతంలో నిర్వహించిన ప్రముఖ బాధ్యతలలో భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీస్ కమిషనర్, ఒడిశా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలు ముఖ్యమైనవి.
పద్మాకర్ ఎస్. రాన్‌పిసే ఒడిశా కేడర్‌లోని 1995 బ్యాచ్‌కు చెందిన రాన్‌పిసే ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా కేంద్ర డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. విమానాశ్రయ భద్రత, వీవీఐపీల రక్షణ వంటి కీలక రంగాలలో దళం కార్యాచరణలో పలు విజయాలను సాధించారు.
రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి కేంద్ర ఎంప్యానెల్‌మెంట్ అనేది ఒక ప్రధాన కెరీర్ మైలు రాయి. ఇది ఈ ఒడిశా అధికారులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), కేంద్ర రిజర్వుడు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్), భారత్ టిబెటు సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) వంటి అగ్ర శ్రేణి జాతీయ భద్రతా సంస్థలకు నాయకత్వం వహించడానికి అర్హులుగా చేస్తుంది. ఈ పరిణామం ఒడిశా అంతర్గత భద్రత భవిష్యత్ నాయకత్వంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఉన్నత స్థాయి కేంద్ర డిప్యుటేషన్ అవకాశాలకు అతీతంగా ఒడిశా తదుపరి పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) రేసులో డాక్టర్ సుధాన్షు షడంగి ప్రధాన పోటీదారుగా ఉన్నారు.


