● ఇద్దరు అరెస్ట్
జయపురం: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రక్కును జయపురం పట్టణ పోలీసు స్టేషన్ పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. జయపురం పోలీసు స్టేషన్ అధికారి ఉల్లాష్ చంద్ర రౌత్ ఆదేశం మేరకు పోలీసులు పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో ట్రక్కు అతి వేగంగా వస్తుండగా పోలీసులు దానిని నిలిపి తనిఖీ చేశారు. ఆ ట్రక్కులో రెండు దూడలు, 24 ఎద్దులు, ఒక సొండి లతను గుర్తించారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పశువులను నవరంగపూర్ జిల్లాకు చెందిన కొంత మంది వ్యాపారులు కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ ప్రాంతంలోని పశువులను కొనుగోలు చేసి తమ వాహనంలో తెలంగాణ రాష్ట్రానికి పంపుతున్నట్లు ట్రక్కు డ్రైవర్ తెలియజేసినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రక్కులో పశువులను తెలంగాణ రాష్ట్రం భధ్రాచలం వైపు తరలిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు.. జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్, ఆ విషయం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్‌కు తెలిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే సబ్‌ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కుమార్ పంగికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. పోలీసులు మాటు వేసి ట్రక్కును పట్టుకున్నారు. పట్టుబడిన పశువులను జయపురం సమీప పాలిగుడ గోశాలకు తరలించారు. పశువులకు జయపురం పశువైద్య అధికారి శౌభాగ్య వైద్య పరీక్షలు చేశారు. డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్లు పట్టణ పోలీసు అధికారి గురువారం వెల్లడించారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


