8 కీలక ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం | - | Sakshi
Sakshi News home page

8 కీలక ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

భువనేశ్వర్‌: ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ అధ్యక్షతన లోక్‌ సేవా భవన్‌లో జరిగిన 39వ సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్గం పలు శాఖలకు సంబంధించిన 8 కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో సుపరిపాలన, పలు రంగాల సమగ్ర అభివృద్ధిని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్న ప్రతిపాదనలపై సీనియర్‌ అధికారులు ప్రవేశ పెట్టిన వివరాల ఆధారంగా మంత్రి వర్గం సమీక్షించింది. సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో ప్రముఖ కార్యదర్శి మాట్లాడుతూ 8 వేర్వేరు శాఖల నుంచి వచ్చిన ఎనిమిది ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించినట్లు ప్రఽముఖ కార్యదర్శి అనూ గర్గ్‌ తెలిపారు. ఆమోదించిన ప్రతిపాదనలలో పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌ – సాంకేతిక సమాచారం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, నిర్మాణాలు, వాణిజ్యం– రవాణా, రెవెన్యూ – విపత్తు నిర్వహణ, సాధారణ పాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం, ఆరోగ్యం – కుటుంబ సంక్షేమ శాఖల నుండి ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ నిర్ణయాలు రాష్ట్రంలోని కీలక రంగాలలో పరిపాలనా ప్రక్రియలను మరింత క్రమబద్ధీకరించి అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇస్తాయని మంత్రి వర్గం అభిప్రాయం వ్యక్తం చేసింది.

నగర గ్యాస్‌ పంపిణీ విధానం

రాష్ట్రంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) మరియు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) మౌలిక సదుపాయాల విస్తరణ వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఒడిశా నగర గ్యాస్‌ పంపిణీ (సీజీడీ) విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ విధానం జాతీయ సుస్థిర ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా బహుళ ఏజెన్సీల ఆమోద ప్రక్రియను సులభతరం చేస్తు స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఆమోద రుసుములపై మార్చి 2027 వరకు ఏక విడత మారటోరియంను ప్రకటించారు.

బొలంగిర్‌లో వస్త్ర పరిశ్రమకు

భారీ ప్రోత్సాహం

మెస్సర్స్‌ శ్రీ అంబిక కాట్‌స్పిన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ బొలంగిర్‌ జిల్లాలో రూ. 124 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక స్పిన్నింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి మంత్రి వర్గం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. కేబీకే ప్రాంతంలోని స్థానిక పత్తికి విలువను జోడించి ‘ఫార్మ్‌ టు ఫ్యాబ్రిక్‌‘ విలువ గొలుసు బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

ఒడిశా రాష్ట్ర డేటా పాలసీ 2.0

ప్రభుత్వ శాఖలన్నింటిలో సురక్షిత, పటిష్టమైన పరస్పర అనుసంధాన డేటా పాలన వ్యవస్థ రూపకల్పన కోసం ఒడిశా రాష్ట్ర డేటా పాలసీ 2.0కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇది డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టానికి అనుగుణంగా ఉంటూ ప్రభుత్వ పథకాలలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. డేటా ఆధారిత పాలనలో ఒడిశాను అగ్రగామిగా నిలపడం దీని లక్ష్యంగా మంత్రి వర్గం పేర్కొంది.

అపార్ట్‌మెంట్‌ కొనుగోలుదారులకు ఉపశమనం

ఒడిశా అపార్ట్‌మెంట్‌ (యాజమాన్యం, నిర్వహణ) చట్టం, 2023 కింద రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడానికి భారత స్టాంప్‌ చట్టం, 1899కి చేసిన సవరణలకు మంత్రి వర్గం ఆమోదం లభించింది. ఇప్పుడు కేటాయింపుదారుల సంఘం ఉమ్మడి ప్రాంతాల బదిలీకి రూ. 50,000 నామ మాత్రపు స్టాంప్‌ డ్యూటీ చెల్లిస్తుంది. కాగా కొనుగోలుదారులు వ్యక్తిగత యూనిట్లపై ఏకరీతిగా 5 శాతం స్టాంప్‌ డ్యూటీ చెల్లిస్తారు. ఈ చర్య ఆర్థిక భారాన్ని తగ్గించి నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.

కఠొజోడి నదిపై

ఉన్నత స్థాయి వంతెన

కటక్‌, భువనేశ్వర్‌ జంట నగరాల మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని కల్పించి 16వ నంబరు జాతీయ రహదారిపై రద్దీని తగ్గించేందుకు కఠొజోడి నదిపై (ప్రస్తుత సుభాష్‌ చంద్ర బోస్‌ సేతుకు ఎగువన) ఒక ఉన్నత స్థాయి వంతెన నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ద్రవ్య సేవా పన్ను మినహాయింపుతో దీని వ్యయ ప్రణాళిక రూ. 158.89 కోట్లు. దీని నిర్మాణం పూర్తికి మంత్రి వర్గం 36 నెలల గడువు నిర్దేశించింది. భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి నందన్‌కానన్‌ వరకు గల రహదారిని 8 అంచెలుగా విస్తరించే ప్రతిపాదనను మంత్రి వర్గం పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement