భువనేశ్వర్:
రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల లభ్యత, పంపిణీని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శుక్రవారం లోక్ సేవా భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అట్టడుగు అంచె వరకు ఎరువుల పంపిణీని నిర్ధారించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జిల్లా కలెక్టర్లతో చర్చలు జరిపారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సరఫరాకు అంతరాయం కలగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతులకు సరసమైన ధరలకు, సకాలంలో అవసరాలకు అనుగుణంగా ఎరువుల సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సేంద్రియ ఎరువు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.77 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 60,000 మెట్రిక్ టన్నులకు పైగా డీఏపీ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పేర్కొన్నారు. రాయితీపై ఇచ్చే యూరియాను పారిశ్రామిక అవసరాలకు దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అలాంటి పద్ధతులను అరికట్టడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని మాఝీ ఆదేశించారు. స్థానిక స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, అన్ని గ్రామ పంచాయతీలలో కొద్ది రోజుల్లోనే విజిలెన్స్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎరువుల అక్రమ అమ్మకాలు, నిల్వలపై ఆకస్మిక తనిఖీలు, ఎఫ్‌ఐఆర్ నమోదు, నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సుల రద్దుతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎరువుల దారి మళ్లింపును నివారించడానికి పోలీసులు మరియు వ్యవసాయ అధికారుల సంయుక్త పర్యవేక్షణతో అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను పెంచాలని ఆదేశించారు.
సమావేశంలో వ్యవసాయ కమిషనర్ కమ్ కార్యదర్శి సచిన్ రామచంద్ర జాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరానికి ఒడిశాకు కేంద్ర ప్రభుత్వం 1.14 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించిందని తెలిపారు. ఏప్రిల్ నెలకు 79,630 మెట్రిక్ టన్నుల అంచనా అవసరానికి గాను ఏప్రిల్ 15 నాటికి రాష్ట్రం వద్ద 361,490 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. 1,029 హోల్‌సేల్ డీలర్లు, 12,093 రిటైల్ డీలర్లు ద్వారా పంపిణీ కొనసాగుతుందన్నారు. డీలర్ పాయింట్ల వద్ద తనిఖీ నిర్వహణలో అవకతవకల కారణంగా 6 మంది లైసెన్సులను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, సహకార శాఖ మంత్రి ప్రదీప్ బాల్ సామంత్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్, వ్యవసాయ, సహకార శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


