భువనేశ్వర్ : రాష్ట్ర రాజధానిలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతం లోక్ సేవా భవన్ సముదాయంలో దొంగతనం చోటు చేసుకుంది. ఈ సంఘటన భద్రతా పటిష్టత పట్ల పలు ప్రశ్నలు ప్రేరేపిస్తుంది. ఈ భవన సముదాయం ఆర్థిక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్ (ఏసీ) విడి బాగాలు దొంగిలించిన సంఘటన వెలుగు చూసింది. ఎయిర్ కండిషనర్ కంప్రెషర్లు, రాగి పైపులను దొంగిలించిన ఆరోపణలపై రాజధాని పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితులు టొమాండోకు చెందిన మనోజ్ కుమార్ దాస్ (25), జాజ్‌పూర్‌లోని బింఝర్‌పూర్‌కు చెందిన చందన్ పొలై (27)గా గుర్తించారు. వారి వద్ద నుంచి పలు ఏసీ కంప్రెసర్ విడిభాగాలు, సంబంధిత సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం కార్యాలయం పైకప్పు, గ్రౌండ్ ఫ్లోర్, సబ్ సెక్రటరీ ఛాంబర్, లైబ్రరీలో అమర్చిన 7 ఏసీ యూనిట్ల కంప్రెసర్‌లు, రాగి పైపులు చోరీకి గురయ్యాయి. నిర్వహణ, మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో వీటిని దొంగిలించారు. ఈ సామగ్రి నవంబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య దశలవారీగా ఈ దొంగతనాలు జరిగాయని ప్రాథమిక విచారణ సమాచారం. దీని ఆధారంగా సచివాలయంలోని భద్రతా సిబ్బంది ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో వారు దొంగతనాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా రాజధాని పోలీసులు కేసు నమోదు చేసి, అనంతరం ఇరువురు నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.


