భువనేశ్వర్: ఆధునిక ఒడిశా నిర్మాతలలో ఒకరు, ఒడియా గర్వానికి ప్రతీక అయిన దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ ఒక మహోన్నత వ్యక్తి అని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సాహసోపేతమైన విమానయాన నిపుణుడు, ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు మరియు సంఘ సేవకుడుగా పలు రంగాల్లో తన పాత్రను విజయవంతంగా ప్రదర్శించారని తెలిపారు. శాసన సభ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత బిజూ పట్నాయక్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, స్పీకర్ సురమా పాఢి, డిప్యూటీ స్పీకర్ భవానీశంకర్ భోయ్, ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వీరందరు దివంగత బిజూ పట్నాయక్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. బిజూ పట్నాయక్ జీవితం ఆధారంగా శాస్వతి సోషల్ అండ్ కల్చరల్ ఇన్‌స్టిట్యూషన్ రూపొందించిన సంగీత ప్రదర్శనకు అతిథి ప్రముఖులు హాజరయ్యారు.


