రాయగడ: జిల్లాలోని చంద్రపూర్ సమితి డంగసొరడ పంచాయతీ పంపపడ్రతొల గ్రామంలో బుధవారం సాయంత్రం అబ్కారీ శాఖ అధికారులు చేపట్టిన దాడుల్లో 21 క్వింటాళ్ల విప్పపువ్వును స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి వినియోగించే విప్పపువ్వును ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామానికి చెందిన సదానంద సామల్ ఇంట్లో నిల్వ ఉంచిన విషయం తెలుసుకున్న అధికారులు ఈ మేరకు ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో విప్పపువ్వు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడు సమాల్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
పర్లాకిమిడి: ఒడిశా ఆదర్శ విద్యాలయం (ఓఏ వీ) గుసాని బ్లాక్ లింగిపురం విద్యార్థిని వ ట్టుకుల యామిని సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో 95.8 శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. గజపతి జిల్లాలో ఉన్న ఏడు ఓఏవీల్లో యామిని ఫస్టు ర్యాంకు సాధించినట్టు ప్రిన్సిపాల్ డంగు యాదవ్‌రావు తెలిపారు. మరో విద్యార్థిని దీపికా సామల్ 90.2 శాతం మార్కులు సాధించింది. ఓఏవీ లింగుపురంలో 60 శాతం మార్కులు సాధించిన వారిలో 37 మంది ఉన్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.


