● 29న రాష్ట్రవ్యాప్త నిరసనలు
భువనేశ్వర్: రాష్ట్రంలో పాత్రికేయుల సమగ్ర సంక్షేమానికి పాత్రికేయ సంఘాలు నడుం బిగించాయి. న్యాయసమ్మతమైన డిమాండ్లపై మోహన్ చరణ్ మాఝి మాట మరిచి వ్యవహరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆరోగ్య బీమా, రూ.15,000 పింఛను, పత్రికా ప్రతినిధుల రక్షణ చట్టం మొదలైన వృత్తిపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్కళ్ పాత్రికేయుల సంఘం (యూజేఏ) ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన విధానానికి నిరసనగా మే 1న నల్ల పట్టీలు ధరించి శాంతియుత నిరసన ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. అంగుల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆ సంస్థ కార్యకర్తలు ఈ తీర్మానం చేశారు.
ఉత్కళ్ పాత్రికేయుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బిభూతి భూషణ్ కొరొ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పాత్రికేయులకు భద్రత కల్పిస్తుండగా ఒడిశాలో వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధీకృత కమిటీ ఏర్పాటుతో పాత్రికేయులకు అధీకృత గుర్తింపు, రాజధానిలో స్వల్ప ఖర్చుతో కూడిన నివాస గృహాల నిర్మాణం, నెలకు రూ.15,000 పింఛను, ఆరోగ్య బీమా, పెళ్లికాని పిల్లలకు బీమా మొదలైనవి డిమాండ్ చేస్తూ 2024 ఫిబ్రవరి 7న రాష్ట్ర, జిల్లా స్థాయి అధీకృత కమిటీని ఏర్పాటు చేసి భువనేశ్వర్‌లో నిరసన చేపట్టారు. ఆ సమయంలో, ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు మోహన్ చరణ్ మాఝీ నిరసన ప్రదేశానికి వచ్చి ఈ డిమాండ్‌కు మద్దతు తెలుపుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ న్యాయసమ్మతమైన డిమాండ్లని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా ఈ హామీ నీటి మీద రాతగా మిగిలిపోయింది. ఇందుకు నిరసనగా ఉత్కళ్ పాత్రికేయుల సంఘం ఈ నెల 29న జిల్లాలో ప్రతీకాత్మక నిరసన చేపట్టనుంది. వెంబడి మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా నల్ల పట్టీలు ధరించి నిరసన తెలుపుతుంది. రానున్న శీతాకాల సమావేశాలకు ముందు ఎలాంటి చర్య తీసుకోకపోతే ఆ సంస్థ భువనేశ్వర్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంది.
ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బేణుధర్ పండా, కార్యనిర్వాహక అధ్యక్షుడు హరధన్ బెనర్జీ, పూర్ణ చంద్ర నాయక్, కోశాధికారి రాజేన్ చౌదరి, ఉపాధ్యక్షులు రష్మీ రంజన్ మిశ్రా, సత్యనారయణ మిశ్రా, సలహాదారులు పథ్వీ మహారథి, బిశ్వజిత్ పట్నాయక్, అంగుల్ జిల్లా అధ్యక్షుడు లోకనాథ్ దొలై, సభ్యులు లోకనాథ్ దళాయి, పూర్ణ చంద్ర సాహు, శ్రీకాంత్ ఖొటై, దేబాశిష్ పురోహిత్, సత్యబ్రత్ దాస్, హరిహర్ స్వంయి పాల్గొన్నారు.
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో పాత్రికేయుల చర్చలు
రాష్ట్రంలోని పాత్రికేయుల సమస్యలు, డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి అనూ గర్గ్‌తో ఐయూడబ్ల్యూజే ప్రతినిధులు చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి దేవ రంజన్ కుమార్ సింగ్, అదనపు సమాచార, పౌర సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి హేమంత్ శర్మ, డైరెక్టర్ అనుజ్ కుమార్ దాస్ పట్నాయక్, డైరెక్టర్ (టెక్నికల్) గుర్బీర్ సింగ్ హాజరయ్యారు. పాత్రికేయుల తరఫున ఐయూడబ్ల్యూజే అఖిల భారత అధ్యక్షుడు పితావస్ మిశ్రా, ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు భగవత్ ప్రసాద్ త్రిపాఠి, భువనేశ్వర్ కార్యాలయ అధ్యక్షుడు హృషికేష్ మహంతి, ఐయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు రవి రాయ్ హాజరై పాత్రికేయుల సామూహిక సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన వివిధ ప్రతిపాదనలు, డిమాండ్లను ప్రముఖ కార్యదర్శికి సమర్పించారు. పాత్రికేయుల ఆర్థిక భద్రత కోసం పింఛను పథకాన్ని అమలు చేయడం, పాత్రికేయులకు ప్రభుత్వ గుర్తింపు మంజూరు చేసేందుకు రాష్ట్ర గుర్తింపు కమిటీని పునర్‌వ్యవస్థీకరణ, ప్రభుత్వ ప్రకటనల పంపిణీలో మరిన్ని సౌకర్యాల కల్పన, పాత్రికేయులకు గుర్తింపు పత్రాలు జారీ చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో సవివరంగా చర్చించారు.


