రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి సగుబారి పంచాయతీ పరిధి కంఠామాల్ గ్రామంలో బీజేపీ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ బృందం బుధవారం పర్యటించింది. నవరంగపూర్ ఎంపీ బలభద్ర మాఝి, కొరాపుట్ ఎమ్మెల్యే రుపుభత్ర, దేవగడ్ ఎమ్మెల్యే సుధీర్ రంజన్ పఠజోషి, రాష్ట్ర ఆదివాసీ మోర్చ సాధారణ కార్యదర్శి కాలీరాం మాఝి, బీజేపీ రాష్ట్ర శాఖ కన్వీనర్ పూర్ణిమ నాయక్, సుశాంత ప్రధాన్, త్రినాథ్ గొమాంగో, అశ్విని కొంచాడ, ఎస్‌డీసీ వైస్ ప్రెసిడెంట్ మంజుల మినియాక, బీజేపీ రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యులు యాళ్ల కొండబాబు, శివకుమార్ పట్నాయక్, బషంత కుమార్ ఉలక తదితరులు బృందంలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం సిజిమాలి బాకై ్సజ్ గనుల తవ్వకాలకు సంబంధించి సగుబారి నుంచి సిజిమాల్ బాకై ్సట్ కొండ వరకు రహదారిని నిర్మిస్తున్న సమయంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి 58 మంది పోలీసులు గ్రామస్తుల రాళ్ల దాడిలో గాయాలు పాలయ్యారు. అదేవిధంగా ఘటనకు ముందురోజు రాత్రి కంఠమాల్ గ్రామంలో పోలీసులు సృష్టించిన దమన కాండలో పదిమంది వరకు గ్రామస్తులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు తెలుసుకునేందుకు రాష్ట్ర బీజేపీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు అక్కడ పరిస్థితిని సమీక్షించడంతో పాటు వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించింది. దీంతో ఆ బృందం సభ్యులు గ్రామస్తులతో మాట్లాడారు. బీజేపీ ప్రజల పార్టీగా గుర్తింపు పొందిందని ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని, అందువల్ల జరిగిన ఘటనకు సంబంధించి వాస్తవాలను భయం లేకుండా గ్రామస్తులు తెలియజేయాలని ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందం వారికి భరోసా ఇచ్చింది. పక్కాగా నివేదికను రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బృందం వివరించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఒక వినతిపత్రంను బృందంకు సమర్పించారు. తమపై తప్పుడు కేసులను పోలీసులు నమోదు చేసి నానా ఇబ్బందులు పెడుతున్నారని, అదేవిధంగా తవ్వకాల పేరిట తాము నమ్ముకున్న కొండలను ధ్వంసం చేసేందుకు చేపడుతున్న సన్నాహాలను తాము వ్యతిరేకిస్తున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు.


