మన గ్రామం పథకం ద్వారా రహదారుల అభివృద్ధి
జెడ్పీ సమావేశంలో కలెక్టర్ కులకర్ణి వెల్లడి
రాయగడ: పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలని జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో బుధవారం నిర్వహించిన 71వ జిల్లా పరిషత్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు ‘మన గ్రామం పథకం’ ద్వారా రహదారు ఏర్పాటు కృషి చేస్తున్నామని అన్నారు. రహదారుల సౌకర్యం కలిగితే అన్ని రంగాల్లో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు వారి దరికి చేరే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవని అన్నారు. అందువల్ల ఈ ఏడాది జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలను రూపొందించామని అన్నారు.
గుణుపూర్ –తెరువలి రైలు మార్గంలో భూసేకరణ
జిల్లాలోలి అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న గుణుపూర్–తెరువలి రైలు మార్గం నిర్మాణం పనుల్లో భాగంగా అవసరమయ్యే భూ సేకరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని కలెక్టర్ చెప్పారు. భూ సేకరణ విషయంలో అంతా సహకరించాలని పిలుపునిచ్చారు. బరంపురం, జయపురం, కెరడ రాయగడ రహదారి నిర్మాణం అలాగే రాయగడ బైపాస్ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తయ్యిందని అన్నారు. జాతీయ రహదారి (ఎన్‌హెచ్)కి పనుల అప్పగించే విషయంలో చురుకుగా పనులు కొనసాగుతున్నాయని వివరించారు. జిల్లాలోని బిసంకటక్, మునిగుడ బైపాస్ రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. దాదాపు జిల్లాలో 800 ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమయ్యిందని.. ఇందులొ కొన్ని ప్రాజెక్టు పనులు ఇప్పటికే నిర్మాణం పనులు ప్రారంభించాయన్నారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో రాయగడ మాత్రమే ఇన్ని అభివృద్ధి పనులకు సంబంధించి పనులు చేపడుతుండటం గర్వించదగ్గ విషయమని అన్నారు.
పర్యాటక రంగానికి పెద్ద పీట
జిల్లాలో పర్యాటక స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధమయ్యిందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. కొలనార, రామనగుడ సమితుల్లో ఈ ఏడాది వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో బంతిపూల సాగును ప్రొత్సాహించేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. నాగవళి, వంశధార నదుల నీటిని సద్వినియోగపరుచుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా సాగు నీటి వనరులను ఈ నదుల నుంచి వ్యవసాయానికి సమకూర్చే విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంల్లో పాల్గొన్న రాయగడ ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక మాట్లాడుతూ.. పీజీటీబీ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. బిసంకటక్ ఎంఎల్‌ఏ నీలమాధవ హికక మాట్లాడుతూ.. తన నియోజకవర్గం పరిధిలోని జగదల్‌పూర్‌లో ఉన్న ఆరోగ్య కేంద్రంలొ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి మాట్లాడుతూ.. జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తే రోగులకు సరైన వైద్య సౌకర్యాలను అందించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 459 మంది వైద్యుల పోస్టుల్లో కేవలం 139 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. ఖాళీగా ఉన్న 320 వైద్యుల పోస్టులను భర్తీ చేయాల్సిన అవశ్యతకత గురించి ప్రస్తావించారు. అంతకు ముందు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతీ మాఝి మాట్లాడుతూ.. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని.. అందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.


