పూరీ రైల్వేస్టేషన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఖుర్దారోడ్ – పూరీ సెక్షన్ పర్యవేక్షించిన జీఎం పరమేశ్వర్
భువనేశ్వర్: రథయాత్రకు ముందే పూరీ రైల్వే స్టేషన్‌లో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ పనుల పురోగతిని నిశితంగా పర్యవేక్షించి రథయాత్రకు చాలా ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. యాత్రికుల సురక్షిత, సులభ, సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలుగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఉద్ఘాటించారు. రాబోయే రథయాత్రను దృష్టిలో ఉంచుకుని తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజరు ఖుర్దా రోడ్, పూరీ సెక్షన్‌ను బుధవారం తనిఖీ చేశారు. అనంతరం పూరీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. జగన్నాథుని రథయాత్ర సమయంలో ఖుర్దారోడ్, పూరీ మార్గంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని, భక్తుల తాకిడి దృష్ట్యా అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ప్లాట్‌ఫారాలు, సంచార ప్రాంతాలు, వేచి ఉండే హాళ్ల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, సులభమైన రాకపోకల వ్యవస్థను సమగ్రంగా మెరుగుపరచాలని పేర్కొన్నారు. రథయాత్ర సమయంలో సమర్థవంతమైన రైళ్ల రవాణా నేపథ్యంలో భద్రత, పారిశుధ్యం, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి ఉన్నత ప్రామాణికలను పాటించాల్సిన ప్రాముఖ్యతను జనరల్ మేనేజర్ వివరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జోనల్ ప్రధాన అధిపతులు, ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


