జయపురం: జయపురం పట్టణంలో మంగళవారం సాయంత్రం జయపురం హిందూ సమాజ్ వారు నిర్వహించిన బిషువ సంక్రాంతి, హనుమాన్ జయంతి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. ఈ సందర్భంగా విజయవాడ–రాంచీ 326 జాతీయ కారిడార్ మార్గం జయపురం పవర్ హౌస్ కూడలి నుంచి ధూంధామ్‌గా ప్రారంభమైన శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జయపురం హిందూ సమాజ్ కార్యకర్తలు కాషాయ పతాకాలు ఎగురవేస్తూ సందడి చేశారు. పవర్ హౌస్ నుంచి బయలు దేరిన శోభాయాత్ర మెయిన్ రోడ్డు, 26వ జాతీయ రహదారి, పారాబెడ మీదుగా పారాబెడలోని మా ఝంఖడ దేవి మందిరం వరకు సాగింది. ఈ సందర్భంగా రాజుగారి కోట కూడలి వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రంతా పట్టణ ప్రధాన మార్గం భక్త జనంతో పోటెత్తింది.


