కొత్త వసంతం | - | Sakshi
Sakshi News home page

కొత్త వసంతం

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

భువనేశ్వర్‌: అనేక సామాజిక, మానవాళి హిత కార్యక్రమాలతో ఇమిడి ఉన్న ఒడియా కొత్త సంవత్సరం మంగళ వారం నుంచి ప్రారంభమైంది. మహా బిషుభ్‌ సంక్రాంతి లేదా పొణా సంక్రాంతి పేరుతో కొత్త సంవత్సరాదిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వేకువ జాము నుంచి ప్రతి ఇంటా ప్రత్యేక పూజల వాతావరణం అలముకుంది. ప్రతి ముంగిట పూర్ణ కలశం ముగ్గు అలంకరణతో శాస్త్రోక్తంగా నింపిన కలశం ఇంటి ప్రవేశం ప్రధాన ద్వారం ముంగిట అమర్చి కొత్త సంవత్సరానికి సంప్రదాయబద్ధంగా ఇంటింటా స్వాగతం పలికారు. ఈ రోజున సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించడంతో రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. సూర్యుడు భూమధ్యరేఖపై ఉండటం వల్ల పగలు మరియు రాత్రి సమయం దాదాపు సమానంగా ఉంటుంది. ఈ సమయం నుండే వేసవి కాలం తీవ్రత పెరుగుతుంది.

శ్రీ జగన్నాథుని సన్నిధిలో కొత్త క్యాలెండరు

పూరీ శ్రీ మందిరంలో రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జగన్నాథుని సన్నిధిలో ఏడాది కొత్త క్యాలెండర్‌ను ఆవిష్కరించడం ఆచారం. డోల పౌర్ణమి నాడు డోల గోవిందునికి సమర్పించిన క్యాలెండర్‌ను మహా బిషుభ్‌ సంక్రాంతి నాడు శ్రీ జగన్నాథుని సన్నిధిలో ఆచరణకు శ్రీకారం చుట్టడంతో కొత్త సంవత్సరం ఆరంభం అయినట్లు పరిగణిస్తారు.

తరణి మాత బంగారు దర్శనం

మహా బిషుభ్‌ సంక్రాంతి పురస్కరించుకుని ఘొటొగాంవ్‌ అధిష్టాన దేవత తరణి మాత స్వర్ణ అలంకరణతో శోభిల్లడం విశేషం. ఈ సందర్భంగా ఈ క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు.

హనుమాన్‌ జయంతి

కొత్త సంవత్సరం ఆరంభం రోజున హనుమాన్‌ జయంతి వేడుకలు ఆధ్యాత్మిక, ధార్మిక వాతావరణం ఆవిష్కరించడం విశేషం. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆంజనేయ స్వామి పూజల సందడి కనిపించింది. ఈ పూజా ప్రాంగణాల్లో పాణకం వితరణ ప్రత్యేక ఏర్పాటుగా కొనసాగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement