వైవిధ్యం భారత దేశ
భువనేశ్వర్: పండుగలను కలిసి మెలిసి జరుపుకోవడం జాతీయ ఐక్యతకు ప్రతీక అని, ఈ సమైక్యతా భావం భారత దేశ వైవిధ్య సంప్రదాయానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. లోక్ భవన్ ప్రాంగణం న్యూ అభిషేక్ హాల్‌లో మంగళ వారం హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం, ఒడియా నూతన సంవత్సరం (పొణా సంక్రాంతి)తో పాటు బిహు (అస్సాం), విషు (కేరళ), పుత్తాండు (తమిళనాడు), పోయిలా బోయిషాఖ్ (పశ్చిమ బెంగాల్), బైసాఖీ (పంజాబ్) పండుగల సంయుక్త వేడుకలో గవర్నర్ ప్రసంగిస్తు భారత దేశ వైవిధ్యమే బలానికి మూలమని అన్నారు. ఈ సందర్భంగా ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, అస్సోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ప్రజలకు వారి వారి పండుగల సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ జయశ్రీ కంభంపాటి హాజరయ్యారు.
ఈ పండుగలను వేర్వేరు ప్రాంతాలలో జరుపుకున్నప్పటికీ అవి ఆశ, కృతజ్ఞత, పునరుజ్జీవనం అనే ఉమ్మడి సందేశం ప్రసారం చేసి జాతీయ ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. మనం ఒకరి పండుగలను మరొకరు జరుపుకున్నప్పుడు, ఒకే దేశంగా మనల్ని ఏకం చేసే బంధాలను మరింత బలోపేతం చేసుకుంటాము. ఈ ఉమ్మడి స్ఫూర్తి భారత దేశ సారాన్ని ప్రతిబింబిస్తుంది, ఇక్కడి వైవిధ్యం మన సామూహిక గుర్తింపును బలపరిచి కలిసి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తుందన్నారు.
పొణా సంక్రాంతి సంప్రదాయ ఒడియా నూతన సంవత్సరానికి నాంది పలుకుతు రాష్ట్ర ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుందని గవర్నర్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జగన్నాథ సంస్కృతి మానవాళి సమ్మిళితత్వం, సమానత్వం, భక్తికి నిదర్శనం. సామాజిక సరిహద్దులకు అతీతంగా ప్రజలను ఏక తాటిపైకి తీసుకువచ్చి విశ్వ సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ప్రముఖ సాహితీవేత్త, గీత రచయిత, విరామ ఐఏఎస్ అధికారి దేవదాస్ ఛోట్రాయ్ ఈ సభను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల విభిన్న సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు కను విందు చేశాయి.
కేరళ
ప్రాంతీయ కథకలి
నృత్య భంగిమలో
కళాకారులు


