● ● జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్‌గా మంత్రి గొండొ బాధ్యతల స్వీకరణ
రాయగడ: జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అందరూ సహకరించాలని, అధికారులు సమన్వయంతో వ్యహరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండొ అన్నారు. మంగళవారం రాయగడలో పర్యటించారు. స్థానిక కలెక్టర్ సమావేశం హాల్‌లో ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రణాళిక మండలి (ప్లానింగ్ బోర్డు) చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టారు. మంత్రికి జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఇటీవల నియమితులైన ఎస్‌డీసీ చైర్మన్ బిద్యాధర్ సబర్, వైస్ చైర్‌పర్సన్ మంజుల మినియాకను కలెక్టర్ అభినందించారు. అనంతరం అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. జిల్లాలో అన్ని ప్రధాన అభివృద్ధి పనులు నాణ్యతగా పూర్తిచేయాలంటే అందుకు అన్ని శాఖలకు చెందిన అధికారుల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు. వ్యవసాయం, నీటి సరఫరా, విద్య, ఆరోగ్యం, గ్రామీణ రహదారులు వంటి జీవనోపాధి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరాలంటే క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు బలోపేతం చేయడం ఎంతో అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఎన్నో పఽథకాలు ప్రజలు సద్వినియోగపరుచుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నా అందుకు సంబంధించిన డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేయాలన్నారు. లేదంటే పనులు ప్రారంభించినా అవి అసంపూర్తిగానే మిగిలిపోవడంతో ఇటు ప్రభుత్వ నిధులు దుర్వినియెగమవ్వడంతోపాటు ఆయా పథకాల వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరదన్నారు. జిల్లాలో చేపడుతున్న, అదేవిధంగా చేపట్టిన ప్రతీ అభివృద్థి కార్యక్రమానికి సంబంధించి సంబఽంధిత శాఖ అధికారులు పరిశీలించడంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్నారు.


