రాయగడ:
జిల్లాలొని కళ్యాణసింగుపూర్ సమితి కార్యాలయంలో జిల్లా యంత్రాంగం సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 34 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో 15 వ్యక్తిగతమైన సమస్యలుగా గుర్తించగా మరో 18 గ్రామ సమస్యలుగా పరిగణలొకి తీసుకున్నారు. గ్రామ సమస్యలను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఒకరికి చికిత్స నిమిత్తం రెడ్ క్రాస్ నిధుల నుంచి పది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి అక్షయ కుమార్ ఖెముండో, ఏఎస్పీ గొసేన్ బర్లా, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోడియా సమితిలో 84 వినతులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి నీలిగూడ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధామేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో 84 వినతులు స్వీకరించారు . వాటిలో 38 వ్యక్తిగత సమస్యలు కాగా.. 46 గ్రామీణ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, భూమి పట్టాలు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు మంజూరు చేయాలని, ఆర్థికసాయం ఇవ్వాలని వినతులు అందించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారుల వంటి మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు, జిల్లా వైధ్యాధికారి డోళామణీ ప్రధాన్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.


