పర్లాకిమిడి: తీవ్రమైన ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. నాలుగు రోజులుగా పర్లాకిమిడిలో పగటి ఉష్ణోగ్రత్తలు పెరగుతూ వస్తున్నాయి. సోమవారం భానుడు భగభగ మండిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పర్లాకిమిడిలో ఉదయం పూట 34 సెంటిగ్రేడ్ డిగ్రీలు నమోదు అవుతుండగా సాయంత్రం 32 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. పట్టణానికి వివిధ పనులపై వేరే గ్రామాల నుంచి వచ్చే గిరిజనులు, విద్యార్థులు వేసవి తీవ్రతకు డిహైడ్రేషన్‌కు గురౌతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు ఒంటిపూట పనివేళలు ప్రారంభమయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు మరో ఐదు రోజులు ఉంటాయని ఐఎండీ మాజీ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర సాహు (భుభనేశ్వర్) తెలియజేశారు.
ఉత్సాహంగా శౌర్య జాగరణ యాత్ర
రాయగడ: జిల్లాలోని బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలొ శౌర్య జాగరణ యాత్ర ఉత్సాహంగా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన యాత్రలో వివిధ పంచాయితీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక జగన్నాథ మందిరం కూడలి నుంచి ప్రారంభమైన యాత్ర పురవీధుల్లో సాగింది. బంగ్లాదేశ్ చొరబాటుదారులను అడ్డుకోవాలని వారంతా నినాదాలు చేశారు. వీరి కారణంగా గోవధ, గోవుల అక్రమ రవాణాలు కొనసాగుతుండటంతొ హిందూ ధర్మానికి తీరని విఘాతం ఏర్పడుతుందని అన్నారు. శ్రీరాముని రథంతో ప్రారంభమైన యాత్ర స్థానిక మెయిన్ బజారులోని శ్రీకృష్ణ మందిరం వరకు వెళ్లి ముగించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహాంతి, ఉపాధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి కునా రమేష్, గొపి బ్రహ్మ, విజయ్ చౌదరి, బి.రాజేష్, జ్యోతి బెహర తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
‘ఈపీఎఫ్ పెన్షన్‌దారులపై చిన్నచూపా..?’
జయపురం: ఈపీఎఫ్ పెన్షన్‌దారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి అన్నారు. నేడు స్థానిక యాదవ భవనంలో కొరాపుట్ జిల్లా ఈపీఎఫ్ పెన్షనర్ల అసోసియేషన్ కార్యదర్వి నళినీ కాంత్ రథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహంతి ప్రసంగిస్తూ ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ దాని మద్దతు పార్టీలు తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంట మహిళకు నెలకు రూ.3000 ఇస్తామని హామీ ఇచ్చాయని, ముప్పై నుంచి నలభై ఏళ్ల పాటు ఉద్యోగాలు చేసి రిటైరైన వారికి రూ.3వేల నుంచి రూ.4వేలు పెన్షన్ ఇవ్వడం చిన్నచూపు కాదా అని ప్రశ్నించారు. ఉద్యోగులు చెల్లించిన డబ్బులు కోట్లలో మూలుగుతున్నా పెన్షన్ ఇచ్చేందుకు ఎందుకు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ఉద్యమాల ద్వారానే పాలకులు దిగి వస్తారని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నళిణీ కాంత రథ్ ప్రసంగిస్తూ గత 2018 నుంచి ఈపీఎఫ్ పెన్షనర్లకు నెలకు డీఏ కలిపి కనీసం రూ.9,000 తోపాటు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరంతర ధర్నా కొన సాగుతున్నప్పటికీ స్పందించడం లేదన్నారు. సమావేశంలో అసోసియేషన్ సలహాదారు సీపీఐ నేత జుదిస్టర్ రౌళోబసంత బెహర, ఉమాకాంత రథ్, రాధాకృష్ణ దాస్, భాస్కర మిశ్ర తదితరులు ప్రసంగించారు.
మానవ అస్థిపంజరం లభ్యం
భువనేశ్వర్: కటక్, పూరీ ప్రధాన కాలువ రోడ్డు ప్రాంతం షొండొపూర్ గ్రామం సమీపంలో మానవ అస్థిపంజరం లభ్యమైంది. బారంగ్ ఠాణా పోలీసులు మానవ అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ అస్థిపంజరాన్ని గోనె సంచిలో తీసుకువచ్చి కాల్చివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గొడి సాహి ఔట్ పోస్ట్, బారంగ్ ఠాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


