ఆమదాలవలస: జిల్లా ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి రైల్వే శాఖ నూతనంగా మంజూరు చేసిన రైలును శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదివరకు జిల్లా ప్రజలు వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడానికి ప్రయాణం చేయాలంటే విశాఖపట్నం లేదా ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించేవారన్నారు. కానీ ఇప్పుడు జిల్లా నుంచే వెళ్లే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. త్వరలో శ్రీకాకుళం రోడ్డు నుంచి హైదరాబాద్ వెళ్లడానికి కూడా మరో రైలు ప్రారంభించడానికి ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్‌ఎం లలిత్ బోహారా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల: మండలంలో కుశాలపురం గ్రామానికి సమీపంలోని ఫ్లై ఓవర్‌పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రూరల్ మండలంలోని భైరి గ్రామానికి చెందిన కొంగరాపు రంగయ్య మృతి చెందగా, బూరె లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం రూరల్ మండలం భైరి గ్రామానికి చెంది న బూరె లక్ష్మణరావు, కొంగరాపు రంగయ్యలు మేకను అమ్మేందుకు లావేరు మండలంలోని బుడుమూరు సంతకు మోపెడ్‌పై వెళ్లారు. మేకను సంతలో అమ్మి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వాహ నం నడుపుతున్న లక్ష్మణరావు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న రంగయ్య రోడ్డుపై పడ్డారు. దీంతో రంగయ్య (50) తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. 108 సాయంతో వీరిని రిమ్స్‌కు తరలించారు. రంగయ్య కుమారుడు లక్ష్మీనారాయ ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగయ్యకు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
హైదరాబాద్‌లో సోంపేట యువకుడు మృతి
సోంపేట: పట్టణానికి చెందిన యువకుడు వికాష్‌కుమార్ నెపాక్ హైదరాబాద్‌లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోంపేటలోని నేతాజీ నగర్‌లో నివాసముంటున్న ఉపాధ్యాయుడు లింగరాజ్ నెపాక్ కుమారుడు వికాష్‌కుమార్ నెపాక్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. వికాష్ మృతితో నేతాజీ నగర్‌లో విషాదచాయలు అలముకున్నాయి.
కంచిలి: సోంపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో నాటుసారా రవాణా, అమ్మకాలపై వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి, గత నేర చరిత్ర కలిగిన పులకపుట్టుగ గ్రామానికి చెందిన పులక లక్ష్మణరావు అనే వ్యక్తి నాటుసారా రవాణా చేస్తున్న సమాచారంతో నిఘా పెట్టారు. దీంతో ఆయన ఒడిశా తుటుపురం నుంచి 300 నాటుసారా ప్యాకెట్లను ద్విచక్ర వాహనంపైన రవాణా చేస్తుండగా.. ఆదివారం సంత దగ్గర కాపుకాసి పట్టుకున్నారు. ఇతని నుంచి నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా మఠం సరియాపల్లి గ్రామంలో నాటుసారా అమ్ముతున్న రత్నాల హేమలత, బొండాడ మోహనరావుల నుంచి 100 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. బొండాడ మోహనరావు, పులక లక్ష్మణరావులు గతంలో పలు కేసుల్లో ముద్దాయిలు. వీరి ముగ్గురినీ సోంపేట కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ జీవీ రమణ తెలిపారు. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. నాటుసారాపై ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14405 లేదా 94409 02358 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. దాడుల్లో ఎస్‌ఐ జగన్నాథ్, సిబ్బంది భాను ప్రసాద్, ఉమాపతి, మార్కారావు పాల్గొన్నారు.


