పండగ పూట విషాదం
● రాయగడ కాపువీధిలో బాంబు పేలుడు ● నలుగురికి తీవ్ర గాయాలు ● సంక్రాంతి సంబరాల వేళ అపశ్రుతి
రాయగడ : సంక్రాంతి సంబరాల వేళ రాయగడ కాపువీధిలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో స్థానిక పిట్లవీధికి చెందిన రెడ్డి నిఖిల్, డి.బొన్ని, ఎస్.కిశోర్ దొర, బి.యోగేశ్వర్ ఉన్నారు. వీరిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నలుగురిని విశాఖపట్నం తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఒక్కసారిగా పేలుడు..
స్థానిక కాపువీధి, మజ్జివీధుల్లో భోగి సంబరాలు నిర్వహిస్తుండగా బుధవారం వేకువజాము సుమారు 3 గంటల ప్రాంతంలో కాపువీధి వెనుక భారీ శబ్ధం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బాంబు పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన వారిని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి గౌరి శంకరరావు అనే వ్యక్తి ఇంటి పైభాగం పూర్తిగా విరిగిపోయింది. తలుపులు విరిగిపోయాయి. పక్కనే ఉన్న ఆటో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు..
విషయం తెలుసుకున్న డీఎస్పీ అమూల్యధల్, ఎస్‌డీపీఓ గౌరహరి సాహు, ఐఐసీ ప్రసన్న కుమార్ బెహరా, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశారు. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడి ఉన్న కాగితపు ముక్కలు, ఇంటి పై భాగం నుంచి కిందపడిన మట్టి పెల్లలు, ధ్వంసమైన ఆటోను పరిశీలించారు. కొద్దిరోజులుగా కొంతమంది ఇక్కడికి రాత్రిపూట వచ్చి ఉంటున్నారని స్థానికులు పోలీసులకు చెప్పారు. అయితే వారు ఎవరన్న విషయం తెలియడం లేదన్నారు. కాపువీధి , మజ్జివీధుల్లో సంబరాలు నిర్వహించే వారిని పోలీసులు పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సంబరాలు నిలిపివేత
కాపు వీధిలో మూడు రోజుల పాటు ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసినా బాంబు పేలుడు నేపథ్యంలో అర్ధంతరంగా ఆపేశారు. ఎటువంటి సంబరాలు నిర్వహించవద్దని పోలీసులు నిర్వాహకులకు ఆదేశించారు. పోలీసుల నుంచి అనుమతులు తీసుకోకపొవడం వల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇకపై తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
పండగ పూట విషాదం
పండగ పూట విషాదం
పండగ పూట విషాదం
పండగ పూట విషాదం
పండగ పూట విషాదం
పండగ పూట విషాదం


