పేదలకు దుస్తులు పంపిణీ
రాయగడ: స్థానిక అంబాగుడలో రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి స్వగృహంలో సంక్రాంతిని పురస్కరించుకుని పేదలకు దుస్తులను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక హాజరయ్యారు. 500 మందికి దుస్తులను పంపిణీ చేశారు. ప్రతీ ఏడాది అప్పల స్వామి కడ్రక ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు తన స్వంత ఖర్చులతో పేదలకు దుస్తులు పంపిణీ చేస్తుండటం అభినందనీయమని ఉలక పేర్కొన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న కడ్రక భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టలని ఆకాంక్షించారు.
గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణ
రాయగడ: ధనుర్మాస పూజల్లో భాగంగా స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణవేంకటేశ్వర మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు, పండ్లు, చీర, గాజులు, పసుపు, కుంకుమను సారెగా భక్తులు సమర్పించారు. ఆయా ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. సారెను సమర్పించిన అనంతరం వాటిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు.
ఆటోబోల్తాపడి ఆరుగురికి గాయాలు
రాయగడ: ఆటోబోల్తా పడిన ఘటనలో ఆరుగురు తీవ్రగాయాలకు గురయ్యారు. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పుటాసింగి పోలీస్ స్టేషన్ పరిధి సింధూర ఘాటి వద్ద ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని గజపతి జిల్లా నువాగడ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. గజపతి జిల్లా నువాగడ వద్ద వారపు సంతను చూసేందుకు ఆబడ సమీపంలోని కులుసింగి గ్రామానికి చెందిన పది మంది ఆటోలో ప్రయాణిస్తుండగా.. సిందూర ఘాటి వద్ద ఆటో అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
పర్లాకిమిడి: పదేళ్ల బాలికపై అత్యాచారం జరిపిన ఘటనలో స్థానిక జంగంవీధిలో నివాసముంటున్న పైల రవి(35)ని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సోమవారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం జరిపాడు. ఈమేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆదర్శ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేయగా రవిని అరెస్టు చేసి కోర్టుకు తర లించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పేదలకు దుస్తులు పంపిణీ
పేదలకు దుస్తులు పంపిణీ


