ఆర్మీ జవాన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్మీ జవాన్‌ మృతి

Jan 14 2026 10:30 AM | Updated on Jan 14 2026 10:30 AM

ఆర్మీ

ఆర్మీ జవాన్‌ మృతి

జలుమూరు: యలమంచిలి గ్రామానికి చెందిన ఆర్మీజవాన్‌ జుత్తు వెంకటరమణ(37) గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్‌లు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణ ఢిల్లీలో ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తున్నారు. మూడు రోజులు క్రితం సెలవుపై ఇంటికి వచ్చారు. పిల్లల చదువుల నిమిత్తం కుటుంబంతో శ్రీకాకుళంలో అద్దె ఇంటిలో ఉంటున్నారు. సోమవారం వేకువజామున గుండెపోటుతో మృతి చెందడంతో భార్య విజయ ఆర్మీ అధికారులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని యలమంచిలి తీసుకొచ్చారు. వెంకటరమణకు భార్యాపిల్లలతో పాటు తల్లిదండ్రులు బోడయ్య, శాంతమ్మ, సోదరుడు గోవిందరావు ఉన్నారు. ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో వెంకటరమణ మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. భార్య విజయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కందిరీగల దాడిలో తొమ్మిది మందికి గాయాలు

రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస సమీపంలోని వరిచేను కళ్లాల వద్ద కందిరీగల దాడిలో తొమ్మది మందికి గాయాలయ్యాయి. మీసాల పెంటనాయుడుకు తీవ్ర గాయాలు కాగా, అతని భార్య కళ్యాణి, గ్రామస్తులు మీసాల రాంబాబు, మీసాల వరలక్ష్మి, క్రిష్ణవేణి, సంచాన హేమలత, సంచాన ఈశ్వరమ్మ, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పెంటనాయుడు రణస్థలం సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడు. మరో నలుగురు చికిత్స పొంది ఇంటికి చేరుకోగా, ఇంకో నలుగురు గ్రామంలోనే ప్రథమ చికిత్స పొందారు.

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి

కవిటి: మండలంలోని బైరెడ్లపుట్టుగకు చెందిన బైరెడ్ల చిరంజీవి(50) తేనెటీగల దాడిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో తోటల పక్కగా వస్తున్న చిరంజీవిపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడిచేసింది. తీవ్రంగా గాయాలు కావడంతో బాధితుడిని కవిటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కవిటి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ డ్రైవర్‌ మృత్యువాత

రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిలో ఆగి ఉన్న లారీలో డ్రైవర్‌ మృతి చెందాడు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుడుమూరు వద్ద లారీ ఉదయం నుంచి పక్కనే నిలిపివేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. మధ్యాహ్నం లారీ క్యాబిన్‌లోనికి చూడగా డ్రైవర్‌ నిద్రపోయి ఉన్నట్లు గమనించారు. ఎంత సేపు పిలిచినా పలకక పోవడంతో లోపలకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే లావేరు పోలీసులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు వచ్చి లారీ యజమానికి సమాచారం అందించారు.

డ్రైవర్‌ గోబర్థన్‌ రాయ్‌(54) ఒంటరిగా వాహనం డ్రైవింగ్‌ చేస్తూ రెండు రోజుల క్రితం పశ్చిమబెంగాల్‌ నుంచి బయలుదేరి హైదరాబాద్‌ వెళుతుండగా బుడుమూరు గ్రామానికి చేరుకునే సరికి నిద్రలోనే గుండెపోటు వచ్చి చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్‌ స్వగ్రామం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మెదినాపూర్‌ జిల్లా పూర్భా పోస్టు బ్రిందాబన్‌ చౌన్‌గా గుర్తించారు. బుడుమూరు వీఆర్వో కె.నవీన్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఏఎస్సై పి.జగన్మోహన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

శ్రీకాకుళం న్యూకాలనీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు ముగుస్తున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం దౌర్భాగ్యకరమని ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు హక్కుగా రావాల్సిన డీఏ బకాయిలను సంక్రాంతి కానుకగా చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు యూనియన్‌ 2026 క్యాలెండర్‌ శ్రీకాకుళం జిల్లా జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆ సంఘ జిల్లా అధ్యక్షులు చల్లా సింహాచలం అధ్యక్షతన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఇచ్చిన మాటలన్నీ ఒట్టి మాటలగానే మిగిలిపోయాయమని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డీఏ బకాయలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ 26 జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని, అధికారంలోకి తీసుకువచ్చి తప్పుచేశామని ప్రతి ఒక్క ఉద్యోగి ఆవేదనలో ఉన్నారని.. భవిష్యత్తులో తగిన మూల్యాం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి అంపోలు షణ్ముఖరావు, జిల్లా ఉపాధ్యక్షులు పైడి నాగేశ్వరరావు, ఏవో సుందరరావు, కె.లక్ష్మీనారాయణ, సీపీఎస్‌ ఉగ్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆర్మీ జవాన్‌ మృతి 1
1/1

ఆర్మీ జవాన్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement