సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీకాకుళం
నేటితో ముగియనున్న బాలుర పోరు
రేపటి నుంచి బాలికల పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ స్కూల్‌గేమ్స్ స్టేట్‌మీట్ క్రికెట్ టోర్నీలో ఆతిథ్య శ్రీకాకుళం బాలురు జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌లో పటిష్టమైన కృష్ణా జిల్లాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీకాకుళం వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–19 పరిమిత ఓవర్ల క్రికెట్ ఛాంపియన్‌షిప్–2025–26 పోటీల్లో భాగంగా రెండో రోజు పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగాయి. లీగ్ కమ్ నాటౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం మైదానంతోపాటు ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల మైదానం, సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్రీదామైదానం, చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల క్రీడామైదానం నాలుగు వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించారు.
హోరాహోరిగా పోరు..
రెండవ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో గుంటూరు జిల్లాపై జయభేరి మోగించిన పశ్చిమగోదావరి జట్టు సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టింది. మిగిలిన మరో రెండు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆట నిలిపివేశారు. చిత్తూరు–తూర్పుగోదావరి జట్ల మద్య జరుగుతున్న మూడవ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ రక్తికట్టింది. ఇరుజట్ల స్కోర్లు సమానం కావడంతో సూపర్‌ఓవర్ నిర్వహించగా.. అందులోను ఇరు జట్ల స్కోర్లు సమానయ్యాయి. రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహించే సమయానికి లైట్‌ఫెయిల్ కావడంతో బుధవారం సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహించనున్నారు. బుధవారంతో బాలు ర క్రికెట్ పోటీలు ముగియనున్నాయి. రెండు సెమీఫైనల్స్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్, మూడవ స్థానం కోసం మరో మ్యాచ్ కలిపి మొత్తం నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. మధ్యాహ్నం విజేతలకు బహుమతులు అందిస్తారు. గురువారం నుంచి బాలికల పోటీలు మొదలుకానున్నాయని ఎస్‌జీఎ ఫ్ సెక్రటరీ బీవీ రమణ, మహిళా సెక్రటరీ ఆర్.స్వాతి తెలిపారు.
సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీకాకుళం


